పాకిస్థాన్ పేస్ సెన్సేషన్ ఇహ్సానుల్లా సంచలన ఆరోపణలు చేయడంతో పాటు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. 22 ఏళ్లకే పాకిస్థాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్)కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా జరిగిన పీఎస్‌ఎల్-10 డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంఛైజీ కూడా తనను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. తనకు ఫ్రాంఛైజీల నుంచి గుర్తింపు, గౌరవం దక్కకపోవడంతో వారిని తిడుతూ అసహనం వ్యక్తం చేశాడు. ఇకపై ఎప్పటికీ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడనని అన్నాడు.
వాస్తవానికి ఇహ్సానుల్లా గత ఎడిషన్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. గంటకు 150 కిమీకు పైగా వేగంతో బౌలింగ్ వేయగలడు. క్రికెట్ ప్రపంచంలో పేస్ కింగ్‌గా మంచి పేరుంది. కానీ తరుచూ గాయాల బారిన పడుతుంటాడు. బహుశా అందుకే అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదని సమాచారం.

ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్ అనంతరం ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాంఛైజీలపై అసహనం వ్యక్తం చేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అనౌన్స్ చేశాడు. "ఒక్క ఫ్రాంఛైజీ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. అద్భుత ప్రదర్శన చేస్తే ఫ్రాంఛైజీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. నేను అదే స్థాయిలో ప్రదర్శన చేసి, ఫ్రాంఛైజీలు నా కోసం వెంటపడాలనేదే నా లక్ష్యం. నేను 150-160 వేగంలో బౌలింగ్ వేస్తాను. ఎవరైతే నేను 130-135 వేగంలో బంతిని సంధిస్తానని అన్నారో.. వాళ్లకు నేనేంటో చూపిస్తా." అని పేర్కొన్నాడు
ఇంకా మాట్లాడుతూ.. "స్వార్థపూరితమైన ప్రపంచం. ఈ ప్రపంచమంతా అంతా స్వార్థపరులతో నిండిపోయింది. క్రికెట్ ప్రపంచంలో నిజాయతీ కరువైంది. ఇకపై ఎప్పటికీ నేను ఏ ఫ్రాంఛైజీకి కూడా ఆడాను. పీఎస్ఎల్ ను బాయ్ కాట్ చేస్తాను. పీఎస్ఎల్ నుంచి రిటైర్ అయిపోతున్నాను. దేశవాలీ క్రికెట్ ఆడి నా సత్తా చాటుతా. పీఎస్‌ఎల్‌లో కాకుండా దేశవాలీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసి పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఎంపిక అవుతా" అని అన్నాడు.
కాగా, తాజాగా జరిగిన పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో ఫ్రాంఛైజీలు స్టార్ ప్లేయర్స్ ను ఎంపిక చేసుకుని తమ జట్లను పటిష్టంగా మార్చుకున్నాయి. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, డారిల్ మిచెల్, లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను దక్కించుకున్నాయి.