పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2026) 2026లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్ల మధ్య జరిగిన 18వ మ్యాచ్‌లో భారీ వివాదం చోటుచేసుకుంది. రావల్పిండి ఇన్నింగ్స్ 9వ ఓవర్ సమయంలో క్వెట్టా స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌కు రాగా.. అతని బౌలింగ్ యాక్షన్‌పై కివీస్ బ్యాటర్ డరిల్ మిచెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ వేసే సమయంలో వింతగా ఆగుతూ బంతిని విసరడం వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటోందని మిచెల్ రెండుసార్లు క్రీజులో నుంచి పక్కకు తప్పుకున్నాడు.
మైదానంలో వాగ్వాదం
డారిల్ మిచెల్ బౌలింగ్ ఆడటానికి నిరాకరించడంతో మైదానంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఉస్మాన్ తారిక్, డారిల్ మిచెల్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా.. అంపైర్లు, ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. నిజానికి ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గత కొంతకాలంగా వివాదాస్పదంగానే ఉంది. తారిక్ మోచేతిలో సహజంగానే డబుల్ జాయింట్ సమస్య ఉందని.. అందుకే బంతి వేసేటప్పుడు చెయ్యి ఆగి ఆగి వస్తుందని అతని వాదన. అయితే బ్యాటర్లు మాత్రం ఇది నిబంధనలకు విరుద్ధమని భావిస్తున్నారు.

క్వెట్టా గ్లాడియేటర్స్ భారీ స్కోరు
వివాదాల నడుమ జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రిలీ రోసో (53) బాధ్యతాయుతమైన అర్థ సెంచరీతో జట్టును ముందుండి నడిపించగా.. సౌద్ షకీల్ (42), హసన్ నవాజ్ (39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో జహందాద్ ఖాన్ 21 పరుగులతో మెరుపులు మెరిపించడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. రావల్పిండి బౌలర్లలో బెన్ సియర్స్ మూడు వికెట్లతో రాణించాడు.
స్పిన్ ఉచ్చులో చిక్కిన రావల్పిండి
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రావల్పిండి జట్టు క్వెట్టా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. ఉస్మాన్ తారిక్, సౌద్ షకీల్, అబ్రార్ అహ్మద్, కాశిఫ్ భట్టీల స్పిన్ చతురతతో రావల్పిండి బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. దీంతో ఆ జట్టు కేవలం 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా క్వెట్టా గ్లాడియేటర్స్ ఈ మ్యాచ్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. అయితే గెలుపు కంటే కూడా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్, మిచెల్ అభ్యంతరం గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.