క్రికెట్ ఆడమంటే కబడ్డీ ఆడారు.. ఏం ఫీల్డింగ్ సామీ! (వీడియో)
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా పెషావర్ జల్మీ జట్టు ఓ సులభమైన రనౌట్ అవకాశాన్ని చేజార్చుకుని నవ్వులపాలైంది. క్విట్టా గ్లాడియేటర్స్ జట్టుతో జరిగిన 23వ మ్యాచ్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ క్రికెటర్ల ఫీల్డింగ్ ప్రమాణాలు తరచుగా విమర్శలకు గురవుతుంటాయి. అయితే తాజగా ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. గెలిచే మ్యాచ్‌లో కూడా ఇంత ఘోరంగా ఫీల్డింగ్ చేయడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన క్వెట్టా గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చోటుచేసుకుంది. పెషావర్ జల్మీ పేసర్ అలీ రజా వేసిన నో బాల్ కారణంగా ఫ్రీ హిట్ లభించింది. ఫ్రీ హిట్ డెలివరీని ఎదుర్కొన్న అబార్ అహ్మద్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బంతిని కొట్టాడు. రన్ కోసం నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఉస్మాన్ తారిక్ క్రీజు వదిలి సగం దూరం వచ్చేశాడు. స్ట్రైకర్ అహ్మద్ కూడా పరుగు కోసం ప్రయత్నించి మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. అప్పటికే ఫీల్డర్ చేతికి బంతి చిక్కింది.

ఫీల్డర్ బంతిని అందుకునే సమయానికి ఇద్దరు బ్యాటర్లు క్రీజు వెలుపలే ఉన్నారు. ముఖ్యంగా ఉస్మాన్ తారిక్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు చాలా దూరంలో ఉండిపోయాడు. ఫీల్డర్ నేరుగా వికెట్లపైకి బంతిని విసిరితే రనౌట్ అయ్యేది. కానీ ఆ ఫీల్డర్ వికెట్లకు దగ్గరగా వెళ్లాలనే ఉద్దేశంతో బంతితో పరిగెత్తుకుంటూ వెళ్లి, తీరా వికెట్లకు చేరువయ్యాక గురి తప్పి విసిరాడు. తగినంత సమయం ఉన్నప్పటికీ స్టంప్స్‌ను కొట్టలేకపోవడంతో బ్యాటర్ సులభంగా క్రీజులోకి చేరుకున్నాడు. ఈ కామెడీ రనౌట్ మిస్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఫీల్డింగ్‌లో విఫలమైనప్పటికీ.. పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. క్వెట్టా నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ 51 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాబర్ ఆజంకు మహమ్మద్ హారిస్, కుశాల్ మెండిస్ అద్భుత సహకారం అందించారు. దీంతో పెషావర్ జల్మీ జట్టు కేవలం 18.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెషావర్ జల్మీ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోకుండా 13 పాయింట్లతో (+2.404 నెట్ రన్ రేట్) దూసుకుపోతోంది. రెండో స్థానంలో ఉన్న ముల్తాన్ సుల్తాన్స్ (8 పాయింట్లు) కంటే పెషావర్ జల్మీ ఏకంగా 5 పాయింట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ఫీల్డింగ్ లోపాలు ఉన్నప్పటికీ బాబర్ సేన పీఎస్‌ఎల్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications