
హైదరాబాద్: షార్జా వేదికగా జరుగుతోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) మూడో సీజన్‌లో శ్రీలంక స్టార్ క్రికెటర్ కుమార సంగక్కర ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పాకిస్థాన్ గడ్డపై నిర్వహించే పీఎస్ఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు కుమార సంగక్కర ఒప్పుకున్నాడు.
ఈ విషయాన్ని ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంఛైజీ ప్రెసిడెంట్ అషర్ చాన్ స్పష్టం చేశారు. దుబాయిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ 'అవును, పాక్‌లో నిర్వహించే మ్యాచ్‌లకు వచ్చేందుకు సంగక్కర ఒప్పుకున్నారు. పాక్‌లో అతనికి ఎంతో ఘన చరిత్ర ఉందని.. అక్కడ పర్యటించేందుకు ఎంతో ఆసక్తి ఉన్నాడు' అని తెలిపారు.
కుమార సంగక్కరతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా పాక్‌లో ఆడేందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. శ్రీలంక జట్టుకు సంగక్కర 2009లో వైస్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో శ్రీలంక పాక్‌లో పర్యటించింది. లాహోర్‌లో మ్యాచ్ ఆడేందుకు బస్సులో వస్తున్న శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఉగ్రదాడిలో పలువురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడగా ఆరుగురు పోలీసులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. దీంతో అప్పటి నుంచి అగ్రశ్రేణి జట్లు పాక్‌లో పర్యటించే సాహసం చేయని సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లను గత రెండు సీజన్లుగా పీసీబీ యూఏఈలో నిర్వహిస్తోంది.
అయితే, పీఎస్ఎల్ మూడో సీజన్‌లో భాగంగా ఎలిమినేటర్-1 మ్యాచ్‌లను లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో నిర్వహస్తున్నారు. లీగ్ ఫైనల్ మ్యాచ్ మార్చి 25న కరాచీ వేదికగా నిర్వహించేలా పీఎస్ఎల్ షెడ్యూల్‌ని ఖరారు చేశారు. దీంతో పాక్ గడ్డపై నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లు ఆడేందుకు పలువురు విదేశీ క్రికెటర్లు విముఖత వ్యక్తం చేశారు.