వీధుల్లో ఫ్యాన్స్ బీభత్సం.. 400 మందికి పైగా అరెస్ట్!
ఫుట్‌బాల్ క్లబ్ "పారిస్ సెయింట్-జర్మన్"(పీఎస్జీ) ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్‌పై ఘన విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్‌లో ఊహించని విధంగా హింస చెలరేగింది. విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అభిమానులు దేశవ్యాప్తంగా అల్లర్లకు దిగడంతో ఫ్రాన్స్ రణరంగంగా మారింది. ఫుట్‌బాల్ అభిమానులకు, పోలీసులకు మధ్య జరిగిన ఈ తీవ్ర హింసాత్మక ఘర్షణల అనంతరం భద్రతా దళాలు రంగంలోకి దిగి ఇప్పటివరకు 400 మందికి పైగా అల్లరిమూకలను అరెస్ట్ చేశాయి. రాజధాని పారిస్ నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఈ గొడవల కారణంగా నగరంలోని బస్సు, రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
పెనాల్టీ షూటౌట్లో పీఎస్జీ విజయం సాధించిన వెంటనే వేలాది మంది అభిమానులు పారిస్‌లోని ప్రసిద్ధ 'చాంప్స్-ఎలిసీస్' వీధిలోకి దూసుకువచ్చారు. మొదట్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్న ఈ గుంపు.. చూస్తుండగానే హింసకు దిగింది. రోడ్డుపై ఉన్న ఎలక్ట్రానిక్ బైక్‌లకు నిప్పు పెట్టడమే కాకుండా, దుకాణాల అద్దాలను పగలగొట్టి లూటీలకు పాల్పడ్డారు. ఉద్రిక్తతలను అణచడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ అల్లర్లలో ఆరు వాహనాలు, రెండు దుకాణాలు, ఒక బస్ షెల్టర్ పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. అంతకుముందు పీఎస్జీ హోమ్ గ్రౌండ్ బయట బిగ్ స్క్రీన్‌లపై మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలోనూ అభిమానులు పోలీసులపై దాడికి దిగారు.

ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 416 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అందులో కేవలం పారిస్ నగరం నుంచే 280 మందిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ హింసను అంతర్గత వ్యవహారాల మంత్రి తీవ్రంగా ఖండించారు. అల్లరిమూకలను అదుపు చేసే క్రమంలో ఏడుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ దేశీయ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ప్రతిపక్ష నాయకురాలు మెరైన్ లీ పెన్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. "కేవలం ఫ్రాన్స్‌లో మాత్రమే ఒక ఫుట్‌బాల్ క్లబ్ విజయం అల్లర్లకు దారితీస్తుంది. ప్రజలు తమ జట్టు గెలిచిన రాత్రి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లల్లో దాక్కోవాల్సిన దుస్థితి ఇక్కడ మాత్రమే ఉంది" అంటూ మండిపడ్డారు.
"పారిస్ సెయింట్-జర్మన్" జట్టు వరుసగా రెండో ఏడాది ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తూ వరుసగా రెండో ఏడాది కూడా వారి విజయం తర్వాత ఫ్రాన్స్‌లో రక్తం ఏరులై పారింది. గతేడాది (2025) పిఎస్జీ యూరోపియన్ ఛాంపియన్‌షిప్ గెలిచినప్పుడు జరిగిన ఘోర అల్లర్లలో 17 ఏళ్ల బాలుడితో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది కూడా ఫుట్‌బాల్ అభిమానులు అదే స్థాయిలో హింసకు తెగబడటం క్రీడా రంగాన్నే కాకుండా ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications