ది హండ్రెడ్ లీగ్-2024 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌కు నిరాశే మిగిలింది. వాళ్లను దక్కించుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఎనిమిది జట్లలో ఏ ఫ్రాంచైజీ వాళ్ల కోసం ముందుకు రాలేదు. బాబర్, రిజ్వాన్‌తో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో అమ్ముడపోలేదు.
ఇంగ్లండ్ ప్లేయర్లు జేసన్ రాయ్, మార్క్ వుడ్, అలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, టిమ్ డేవిడ్ కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. మరోవైపు ఉమెన్స్ క్రికెట్ వేలంలో టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధాన, రిచా ఘోష్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. స్మృతిని సౌథర్న్ బ్రేవ్ టీమ్, రిచాను బర్నింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టు దక్కించుకుంది.

ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విజయంలో స్మృతి మంధాన, రిచా ఘోష్ కీలకపాత్ర పోషించారు. మరోవైపు భారత మహిళా స్టార్ క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మకు నిరాశ ఎదురైంది. వాళ్లను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు.
కాగా, వెస్టిండీస్ ఆటగాళ్లకు వేలంలో డిమాండ్ నెలకొంది. వేలంలో నికోలస్ పూరన్ కోసం లక్షా 25వేల పౌండ్ల ధర పలికాడు. పూరన్‌ను నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ సొంతం చేసుకుంది. ఆండ్రీ రసెల్, హెట్‌మెయిర్‌లను లండన్ స్పిరిట్‌కు, పొలార్డ్‌ను సౌథర్న్ బ్రేవ్ దక్కించుకున్నాయి. అయితే పాక్ పేసర్ నసీమ్ షాను బర్మింగ్‌హామ్ ఫొనిక్స్ దక్కించుకుంది. అతడి కోసం లక్ష పౌండ్లు వెచ్చించింది. షాహిన్ అఫ్రిదిని వెల్ష్ ఫైర్ తీసుకుంది. అఫ్రిది కూడా వేలంలో లక్ష పౌండ్ల ధర పలికాడు. జులై 23 నుంచి ది హండ్రెడ్-2024 లీగ్ ప్రారంభం కానుంది.