బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించిన ఇండియా ఏ
హైదరాబాద్: టీమిండియాతో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు వార్మప్ మ్యాచ్‌లో చుక్కలు కనిపించాయి. బంగ్లాతో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు ఆటగాళ్ల దెబ్బకు బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.
వార్మప్ మ్యాచ్‌లో ముష్ఫికర్ సేనను భారత కుర్రాళ్లు ఓ ఆటాడుకున్నారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ సెంచరీ సాధించాడు. శ్రేయాస్ అయ్యర్, తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ కూడా సెంచరీలు నమోదు చేశారు. రెండో రోజంతా బౌలింగ్ చేసినా ఆతిథ్య జట్టు కేవలం ఐదు వికెట్లు మాత్రమే దక్కించుకుంది.
దీంతో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వేదికగా భారత ఏ-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల నష్టానికి 224 పరుగుల స్కోరు వద్ద బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఏ ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు సాధించింది. రెండో రోజైన సోమవారం 91/1 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఇండియా ఏ జట్టులో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ప్రియాంక్ పాంచల్, శ్రేయాస్ అయ్యర్ హవానే సాగింది.

రెండో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం
వీరిద్దరూ భారీ షాట్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకు పడి రెండో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పాంచాల్ (103), శ్రేయాస్ అయ్యర్ (100) సెంచరీలతో హోరెత్తించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (19), ఇషాంక్ జగ్గీ (23), ఇషాన్ కిషన్ (11) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు.

20 పరుగుల తేడాతో 4 వికెట్లు
హార్దిక్ పాండ్యా (7) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇండియా ఏ జట్టు 20 పరుగుల తేడాతో 4 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ వి.శంకర్ (103) కూడా అజేయ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతను నితిన్ సైనీతో కలిసి 8వ వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 237 ఆధిక్యం
ఈ క్రమంలో నితిన్ సైనీ (66) అర్ధ సెంచరీతో మెరిశాడు. దీంతో 370 పరుగులు జోడించి 461/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ముకుంద్ సేనకు 237 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుభాశిష్ రాయ్, తైజుల్ ఇస్లామ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

15 ఓవర్లు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్
కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో బంగ్లాదేశ్‌కు 15 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (25)తో పాటు మొమినుల్ హక్ (0)లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు.

డ్రాగా ముగిసిన బంగ్లా-ఇండియా ఏ వార్మప్ మ్యాచ్
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (42), మహ్మదుల్లా (1) అజేయంగా నిలిచారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేయడంతో.. మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications