
హైదరాబాద్: శ్రీలంకతో కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల మోత మోగించాడు. 263 పరుగుల లక్ష్య ఛేదనని సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆరంభించిన పృథ్వీ షా (43: 24 బంతుల్లో 9x4) వరుస ఫోర్లతో శ్రీలంక బౌలర్లకి కాసేపు చెమటలు పట్టించేశాడు. క్రీజులో ఉన్నంతసేపు ఓవర్‌కు రెండు ఫోర్ల చొప్పున బాదాడు. హ్యాట్రిక్ ఫోర్లు కూడా బాదాడు. షా చెలరేగడంతో భారత్ ఐదు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అందులో ధావన్ చేసిన స్కోరు 7 పరుగులు మాత్రమేఅంటే.. షా ఎలా చెలరేగాడో అర్ధం చేసుకోవచ్చు.
బౌండరీలతో విరుచుకుపడుతున్న పృథ్వీ షాని కట్టడి చేసేందుకు ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో స్పిన్నర్ ధనంజయాని బరిలోకి దించిన శ్రీలంక కెప్టెన్ షనక సక్సెస్ అయ్యాడు. మిడ్ వికెట్, లాంగాన్‌లో ఫీల్డర్లని ఉంచాడు. ఆ ఓవర్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే షా.. లాంగాన్ దిశగా సిక్స్ కోసం భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. ఫీల్డర్ అవిష్కా ఫెర్నాండో చేతికి చిక్కాడు. దాంతో షా సుడిగాలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇక శ్రీలంక బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు.
24 బంతుల్లో 43 పరుగులు చేసిన పృథ్వీ షా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2002 నుంచి ఇన్నింగ్స్ మొదటి ఐదు ఓవర్లలో ఇన్ని పరుగులు ఏ భారత బ్యాట్స్‌మన్ చేయలేదు. అంతకుముందు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్ తొలి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. షా భారత్ తరఫున 5 టెస్టులు, 4 వన్డేలు ఆడాడు. టెస్టులో 339, వన్డేల్లో 127 రన్స్ చేశాడు.
కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో యువ భారత్ సత్తాచాటింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో చమికా కరుణరత్నె(43 నాటౌట్; 35 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడి లంక జట్టుకు పోరాడే స్కోర్ అందించాడు. చరిత అసలంక (38), కెప్టెన్ దాసన్ షనకా (39) పర్వాలేదనిపించారు. 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1x6) మంచి ఆరంభం ఇచ్చారు. ఆపై యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (59; 42 బంతుల్లో 8x4, 2x6), సూర్యకుమార్ యాదవ్ (31; 20 బంతుల్లో 5x4) ధాటిగా ఆడి టీమిండియాకు సునాయాస విజయాన్ని అందించారు. దాంతో భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో బోణి కొట్టింది