
న్యూ ఢిల్లీ: టీమిండియాలో ఆడతాడా.. లేదా అనే విషయంపై తానేమీ ఆలోచించడం లేదని అంటున్నాడు యువ క్రికెటర్ పృథ్వీ షా. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ యువ కెరటం.. ఇటీవల విదేశీ పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అది చూసిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. అతడిపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు భారత జట్టులో చోటివ్వాలని అన్నాడు. దీనిపై తాజాగా పృథ్వీ షా స్పందించాడు.
'సునీల్ గవాస్కర్ నాపై ప్రశంసల వర్షం కురిపించిన వార్తకు సంబంధించి నా స్నేహితుడు ఒకరు స్ర్కీన్ షాట్‌ను నాకు పంపాడు. అప్పుడే నాకు తెలిసింది. టీమిండియాలో ఆడే దాని గురించి ప్రస్తుతం నేను ఏమీ ఆలోచించడం లేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైనే ఇప్పుడు నా దృష్టి అంతా. ఆడే ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేయాలి. అంతే ఆ తర్వాత ఏది జరిగితే అది జరుగుతుంది.'
'కోచ్ రాహుల్ ద్రవిడ్ నాకు ఒకటే చెప్పారు. వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడు... పరుగులు గురించి ఏ మాత్రం ఆలోచించకు. అప్పుడే పరుగులు చేయగలం అని అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ద్రవిడ్ సర్ నాతో ఇలా అన్నారు. ఈ సూత్రం నాకు బాగా పనికొచ్చింది. నాలుగు రోజుల మ్యాచ్‌లో అయినా సరే నా తరహా షాట్లు ఆడేందుకే నేను ప్రయత్నిస్తా. పరుగులు రాబట్టడం.. స్కోరు బోర్డును కదిలించడం చేస్తే నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. అటాకింగ్ షాట్స్ ఆడటం నా బలం. ఒక్కోసారి బౌలర్లు ఆధిపత్యం ఉన్నప్పుడు మనమేం చేయలేం. వికెట్ కాపాడుకుంటూ ఆడాలి' అని పృథ్వీ షా అన్నాడు.
చూసేందుకు సచిన్ పరిమాణంలో కనిపించే పృథ్వీ షాను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తుండటం గమనార్హ్. ఇంతకుముందు జరిగిన దులీప్ ట్రోఫీలోనూ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత జరిగిన చాలా టోర్నీల్లో ఆడిన పృథ్వీ ఇరానీ కప్ లోనూ ఇరగదీశాడు. ప్రస్తుతం షా భారత్ ఏ జట్టులో టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ ఏ జట్టుతో తలపడుతున్నాడు.