
డోపింగ్ పరీక్షలు:
సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మ్యాచ్ ఆడుతుండగా పృథ్వీషాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పృథ్వీషా నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్టు తేలింది. షా మూత్ర నమూనాల్లో 'టర్బుటలైన్' అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) అధికారులు గుర్తించారు.

8 నెలల నిషేధం:
డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కమిటీ బీసీసీఐ ఏడీఆర్ ఆర్టికల్ 2.1 ప్రకారం షాపై బీసీసీఐ నిషేధం విధించింది. దీంతో 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను షా ఆడరాదు. అయితే ఈ నిషేధం తాజాగా కాకుండా.. మార్చి 16 నుంచి నవంబర్ 15 వరకు కొనసాగుతుంది. అంటే మరో నెలన్నర రోజుల్లో నిషేధం ముగుస్తుంది. షాతో పాటు మరో ఇద్దరు జూనియర్ క్రికెటర్లు అక్షయ్ దలర్వార్, రాజస్థాన్ ఆటగాడు దివ్య గజరాజ్ సైతం డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యారు.

తప్పుచేశా:
పృథ్వీ షా కావాలని 'టర్బుటలైన్' ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదు. దగ్గుమందు తీసుకోగా.. ఆ మందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉంది. వాడా నిషేధిత జాబితాలో టెర్బుటలైన్ ఉత్ప్రేరకం ఉంది. షా మాట్లాడుతూ... 'గాయంతో ఇప్పటికే జట్టులో చోటు కోల్పోయా. మళ్లీ నిషేధం వార్తతో కుంగిపోయా. చికిత్స కోసం మినహాయింపు ధ్రువపత్రం తీసుకోకుండా తప్పుచేశా. ఏ మెడిసిన్ తీసుకొనేప్పుడైనా ఎంతో జాగ్రత్తగా ఉండాలని అర్ధమయింది. ఏదేమైనా ప్రొటోకాల్ ఉల్లంఘించొద్దు' అని షా అన్నాడు.

దగ్గు మందు తీసుకున్నా:
'క్రికెట్ నా జీవితం. నాకు క్రికెట్ మాత్రమే తెలుసు. టీమిండియా, ముంబై జట్టుకు ఆడటమే నాకు ముఖ్యం. జలుబు చేయడంతోనే దగ్గు మందు తీసుకున్నా. త్వరగా కోలుకుని క్రికెట్ ఆడాలన్న తొందరలో ప్రొటోకాల్ ఉల్లంఘించా. తొందరలోనే జట్టులోకి తిరిగొస్తానన్న నమ్మకం ఉంది' అని షా పేర్కొన్నాడు. నిషేధం మార్చి16 అమలైతే.. 23 నుంచి మొదలైన ఐపీఎల్ 12వ సీజన్‌లో షా ఆడడం విశేషం.


Click it and Unblock the Notifications












