బీసీసీఐ నిషేధం నుంచి భారత జట్టు వరకు.. దూసుకొచ్చిన లక్నో బుల్లెట్!
టెన్నిస్ బాల్ క్రికెట్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. వయస్సు వివాదం కారణంగా బీసీసీఐ నుంచి నిషేధాన్ని ఎదుర్కొని వన్డే, టీ20 జట్లలో స్థానాన్ని సంపాదించుకున్నాడు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎంతటి కష్టాలనైనా అధిగమించవచ్చని చెప్పడానికి ప్రిన్స్ యాదవ్ జీవితమే ఓ నిదర్శనం. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్,ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల కోసం ప్రిన్స్ యాదవ్‌ను టీమిండియాలోకి ఎంపిక చేయడం అతని శ్రమకు దక్కిన ఫలితమని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో రాబోయే మ్యాచ్‌ల్లో ప్రిన్స్ యాదవ్‌కు ఆడే అవకాశం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఢిల్లీకి సమీపంలోని దరియాపూర్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్ క్రికెట్ జర్నీ అంత సులభంగా సాగలేదు. తన కుమారుడికి క్రికెట్ పట్ల ఉన్న అమితమైన ప్రేమను చూసి రైల్వే పోలీస్ రిటైర్డ్ అధికారి అయిన తండ్రి రామ్ నివాస్ ఎంతో ఆందోళన చెందాడు. కొడుకు భవిష్యత్తు కోసం ప్రిన్స్ యాదవ్‌ను ప్రభుత్వ ఉద్యోగం చేయమని ఒత్తిడి తెచ్చాడు. తండ్రి మాట కోసం ఢిల్లీ పోలీస్ ఉద్యోగానికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్‌లో పాస్ అయినప్పటికీ..క్రికెట్ ఆడాలనే బలమైన కోరిక వల్ల రాత పరీక్షకు హాజరు కాలేదు. అయితే తల్లి మద్దతుతో ప్రిన్స్ యాదవ్ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాడు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రిన్స్ యాదవ్ కు 18 ఏళ్లు వచ్చేవరకు అసలు లెదర్ బాల్ తో ఆడిన అనుభవమే లేదు.

నజాఫ్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కేవలం టెన్నిస్ బంతితో వేగంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్‌లు ఆడేవాడు. ఆ సమయంలో కోచ్ అమిత్ వశిష్టను కలవడం ప్రిన్స్ యాదవ్ జీవితాన్ని మలుపు తిప్పింది. టెన్నిస్ బాల్‌తో ప్రిన్స్ యాదవ్ వేసే ఖచ్చితమైన యార్కర్లను చూసి ఆశ్చర్యపోయిన అమిత్.. అతనికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. 18 ఏళ్ల వయసులో క్రికెట్ కెరీర్ ప్రారంభించడం వల్ల ఇతరుల కంటే ఎక్కువగా కష్టపడాలని కోచ్ సూచించాడు. దానికి తగ్గట్టే ప్రిన్స్ యాదవ్ కూడా చాలా కష్టపడ్డాడు. అయితే 2019లో ఢిల్లీ అండర్-19 జట్టు తరఫున ఆడుతున్న సమయంలో వయసు తగ్గించి చూపించాడనే ఆరోపణలతో బీసీసీఐ ప్రిన్స్ యాదవ్ పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం ప్రిన్స్ కెరీర్‌కు పెద్ద సవాల్‌గా మారింది.
నిషేధం ముగిసిన అనంతరం మళ్లీ స్టేడియంలోకి అడుగుపెట్టిన ప్రిన్స్ యాదవ్.. మొదట నెట్ బౌలర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2024 దేశవాళీ క్రికెట్ సీజన్లో విజయ్ హజారే ట్రోఫీలో 18 వికెట్లు, ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో 'పురానీ ఢిల్లీ-6' జట్టు తరఫున 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో 2026 ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతడిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ 2026 ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ముఖ్యంగా ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాను పాటిస్తూనే.. ఆయననే డకౌట్ చేయడం ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు ప్రిన్స్ యాదవ్.
ఐపీఎల్ 2026లో చూపించిన ఈ అసాధారణ ప్రతిభతో ప్రిన్స్ యాదవ్‌కు వెంటనే టీమిండియాలో చోటు దక్కింది. అంతర్జాతీయ క్రికెట్లో కూడా అడుగుపెడుతూనే ప్రిన్స్ యాదవ్ తన సత్తా చాటాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తన మొదటి వన్డే మ్యాచ్‌లోనే 2 వికెట్లు పడగొట్టగా.. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రిన్స్ యాదవ్ తన ప్రతిభను నిరూపించుకుంటూ దూసుకుపోతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications