ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అనేక రికార్డులు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆస్ట్రేలియాతో జరిగిన బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే మోడీ అశ్విన్ కు లేఖ రాశారు. ప్రధాన మంత్రి అశ్విన్ అద్భుతమైన కెరీర్‌ను కొనియాడారు.
వినూత్న వైవిధ్యాలతో బ్యాట్స్‌మెన్‌లను తిప్పలు పెట్టేవారని పేర్కొన్నారు. జట్టు పట్ల అశ్విన్‌కు ఉన్న నిబద్ధతను మోడీ ప్రశంసించారు. కష్టాల్లో కూడా అతను తన చిత్తశుద్ధిని కూడా కొనియాడాడు. అశ్విన్ ఐకానిక్ జెర్సీ నంబర్ 99ని పీఎం మోడీ ప్రేమగా గుర్తు చేసుకున్నారు. 38 ఏళ్ల అతను ఆరు సెంచరీలతో సహా 3,503 పరుగులు చేయడంతో పాటు, 24 సగటుతో 537 టెస్ట్ వికెట్లు సాధించిన అద్భుతమైన రికార్డుతో రిటైర్ అయ్యాడు. వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు కూడా సాధించాడు.

అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనను ఆటలో ఊహించని ట్విస్ట్‌తో ప్రధాని పోల్చారు. దానిని ఆశ్చర్యకరమైన క్యారమ్ బాల్‌తో పోల్చారు. "అంతర్జాతీయ క్రికెట్ నుంచి మీ రిటైర్మెంట్ ప్రకటన భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రతి ఒక్కరూ మరెన్నో ఆఫ్-బ్రేక్‌ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో, మీరు ప్రతి ఒక్కరినీ బౌలింగ్ చేసే క్యారమ్ బాల్‌ను విసిరారు" అని పీఎం మోడీ పేర్కొన్నారు. "జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టారు. మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు కోసం ఆలోచించారు. చెన్నై వరదల సమయంలోనూ కుటుంబ సభ్యులతో కాకుండా జట్టుతోనే ఉన్నారు" అని పేర్కొన్నారు.
"అయితే, ఇది మీకు కూడా కఠినమైన నిర్ణయం అని అందరూ అర్థం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 765 వికెట్లలో ఒక్కొక్కటి ఎంతో స్పెషల్" అని పేర్కొన్నారు. 2021 సిడ్నీటెస్టులో బ్యాటర్‌గా జట్టును కాపాడిన తీరు దేశం ఎప్పటికీ మరిచిపోదని మోడీ గుర్తు చేశారు. ప్రపంచ కప్ 2022లో పాకిస్థాన్‌పై చివరి విన్నింగ్ షాట్ అద్భుతమని ప్రశంసించారు.