హామిల్టన్: ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్ బీలో వరుస విజయాలతో ఉన్న భారత జట్టు మంగళవారం నాడు ఐర్లాండుతో జరిగే మ్యాచ్ పైన కూడా గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఐర్లాండ్ పసికూన అయినప్పటికీ.. మంచి ప్రదర్శన ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ గెలుస్తుందని అభిమానులు భావిస్తున్నప్పటికీ.. అది ఎలా ఉంటుందనేదే ఉత్కంఠగా మారింది.
భారత్ వరుసగా నాలుగు విజయాలతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ఇప్పుడు ఐర్లాండు పైన గెలిచి ఈ ప్రపంచకప్‌లో ఐదో విజయం కోసం ఎదురు చూస్తోంది. రేపటి మ్యాచ్ భారత్ గెలిస్తే.. భారత్ సరికొత్త రికార్డ్ సృష్టిస్తుంది. ప్రపంచ కప్‌లలో వరుసగా తొమ్మిదో గెలుపు సాధించిన జట్టుగా నిలుస్తుంది.
2011 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ పైన చెన్నైలో గెలిచిన భారత్.. ఈ ప్రపంచ కప్‌లో కూడా ఇప్పటి వరకు ఓడిపోలేదు. 2003 ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది. ఇప్పటి మన జట్టు దాంతో సమానంగా ఉంది. ఐర్లాండ్ పైన గెలుపుతో ఆ రికార్డ్ బద్దలవుతుంది.
గత ప్రపంచకప్ (2011)లో బెంగళూరులో భారత్ - ఐర్లాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. యువరాజ్ సింగ్ అర్ధ సెంచరీ చేయడంతో పాటు బాల్‌తోను రాణించాడు. అతను ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుత జట్టులో షమీ, అశ్విన్ వంటి వారు ఐర్లాండ్‌ను దెబ్బతీయవచ్చు.
ఈ ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడి 37 వికెట్లు తీసింది. రవిచంద్రన్ అశ్విన్, షమీలు చెరో తొమ్మిది వికెట్లు తీశారు. ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, రవీంద్ర జడెజాలు చెరో ఆరు వికెట్లు తీశారు. బౌలర్లు అద్భుత ప్రతిభ కనబరుస్తున్న నేపథ్యంలో.. భారత్‌కు భారీ విజయం ఖాయమని అంటున్నారు. జడెజా ఎకానమీ రేటు 4.51గా ఉంది.

సెడెన్ పార్క్‌లో భారత్‌కు పూర్ రికార్డ్.. ఐర్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్
సెడెన్ పార్కులో భారత్‌కు ఏమాత్రం మంచి రికార్డ్ లేదు. ఇక్కడ భారత్ ఎనిమిది మ్యాచులు ఆడితో అందులో కేవలం రెండే గెలిచింది. అంతేకాదు, భారత బ్యాట్స్‌మెన్ ఈ ఫీల్డ్‌లో మూడంకెల స్కోర్ చేసింది ఒకేఒక్కసారి. 2002-03లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు ఐర్లాండ్ పైన గెలవడం ద్వారా ఈ పిచ్ పైన భారత్ తన రికార్డ్ మెరుగుపర్చుకోవచ్చు.
మరోవైపు, ఈ పిచ్ పైన భారత్‌కు పూర్ రికార్డ్ ఉండటం ఐర్లాండ్‌కు మంచి అవకాశంగా చెప్పవచ్చు. రేపటి మ్యాచులో భారత్‌ను ఓడించినా, ఆ తర్వాతి మ్యాచులో పాకిస్తాన్‌ను ఓడించినా ఐర్లాండ్ క్వార్టర్‌కు చేరుకుంటుంది. ఐర్లాండ్ జట్టు సమిష్టిగా ఆడుతోంది. ఎడ్ జోయిస్, ఆండీ బాల్బిర్నీలు బ్యాట్‌తో సత్తా చాటుతున్నారు.
కీలక ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ ఒక్కసారి మినహా అంతగా ఆడలేదు. ఇక, ఐర్లాండ్ బౌలర్ రాంకిన్‌తో భారత్‌కు పెద్దగా ఇబ్బంది లేదనే చెప్పవచ్చు. ఆల్ రౌండర్, అలెక్స్ కసక్ (6వికెట్లు), లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ జార్జ్ డోక్ రెల్ (5 వికెట్లు) భారత్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేయవచ్చు.
జట్లు
భారత్: మహేంద్ర సింగ్ ధోనీ (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవింద్ర జడెజా, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, అంబటి రాయుడు, స్టార్ట్ బిన్నీ, భువనేశ్వర్ కుమార్
ఐర్లాండ్: విలియమ్ పోర్టర్ ఫీల్డ్ (సారథి), ఆండీ బాల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్, నియాల్ ఓబ్రెయిన్, కెవిన్ ఓ బ్రెయిన్, ఎడ్ జోయిస్, పీటర్ చేస్, అలెక్స్ కసక్, జార్జ్ డాక్ రెల్, జాన్ మూనీ, మాక్స్ సోరెన్సెన్, స్టార్ట్ థామ్సన్, గారీ విల్సన్, క్రెయిగ్ యంగ్ ఆండీ మెక్ బ్రైన్,