500 నాటౌట్: 84ఏళ్ల టెస్ట్ ఇన్నింగ్స్, ప్రపంచ క్రికెట్‌లో మన పాత్ర ఎంత?
కాన్పూర్: మరికొన్ని గంటల్లో టీమిండియా చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ 84 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను అందుకుంది. ఈ 84ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియా ఎన్నో మధుర జ్ఞాపకాలు, స్మృతులను సొంతం చేసుకుంది.
1932లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు ఆడిన టీమిండియా, అదే ఇంగ్లాండ్ జట్టుపై 1952 అంటే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. 1968లో విదేశీ గడ్డపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ క్రికెట్‌కు సెంటర్‌గా భారత్ మారింది. అంతేకాదు ప్రపంచ క్రికెట్‌కు ఆణిముత్యాల లాంటి ఆటగాళ్లను టీమిండియా అందించింది.
ఇప్పటి వరకు 499 టెస్టు మ్యాచ్‌లాడిన టీమిండియా 129 టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 157 టెస్టుల్లో పరాజయం పాలైంది. టీమిండియా తన 100వ టెస్టు మ్యాచ్‌ని ఇంగ్లాండ్ జట్టుపై ఆడింది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇక 200వ టెస్టు మ్యాచ్‌ను దాయాది దేశమైన పాకిస్థాన్‌పై ఆడింది.
అదే విధంగా 300వ టెస్టు మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా ఆడగా, 400వ టెస్టు మ్యాచ్‌ని వెస్టిండిస్‌పై ఆడి విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్‌లో పసికూనల నుంచి నెంబర్ వన్ ర్యాంక్‌కు ఎదిగింది. టెస్టు క్రికెట్లో భారత్ బ్యాట్స్‌మెన్ రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లలో తొలి ట్రిపుల్ సెంచరీని సెహ్వాగ్ సాధించాడు.
దక్షిణ ముంబైలోని జింఖానా గ్రౌండ్స్‌లో 1933లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాలా అమర్నాథ్ 118 పరుగులు చేసి భారత టెస్టు క్రికెట్లో మొట్టమొదటి సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా భారత బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు.
సచిన్ 200 టెస్టులాడి మొత్తం 15,921 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే మ్యాచ్ టీమిండియాకు 500వ టెస్ట్. దీంతో ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది కోహ్లి సేన. ఈ మ్యాచ్ తర్వాత మరో 12 టెస్టులు సొంతగడ్డపై ఆడనుండటంతో సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది.

500వ టెస్ట్ మ్యాచ్ కోసం కాన్పూర్‌కు భారత జట్టు మాజీ కెప్టెన్లు
ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు మాజీ కెప్టెన్లు కాన్పూర్‌కు వస్తున్నారు. 500వ టెస్టు మ్యాచ్‌ను చిరకాలం గుర్తుంచుకునేలా ఏర్పాట్లను బీసీసీఐ చేస్తోంది. కోహ్లీ నేతృత్వంలోని యువ జట్టుకు ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఇప్పటికే మాజీ కెప్టెన్లందరికీ బీసీసీఐ ఆహ్వానాలు పంపింది. 1932లో ప్రారంభమైన భారత టెస్టు క్రికెట్ ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకమైంది. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు మాత్రమే 500కు పైగా టెస్టులు ఆడిన ఘనతను సొంతం చేసుకున్నాయి.

వెస్టిండిస్‌లో సిరిస్ విజయంతో టీమిండియాలో రెట్టింపు ఉత్సాహం
ఇక మ్యాచ్ విషయానికి వెస్టిండిస్‌లో సిరిస్ విజయంతో టీమిండియా ఉత్సాహాంతో ఉంది. సొంతగడ్డపై అనుకూలించే పిచ్‌లు టీమిండియాకు ప్లస్ పాయింట్. అయితే ఈ మ్యాచ్‌లో ఎంత మంది బౌలర్లతో బరిలోకి దిగాలన్నదే టీమిండియా ముందు ప్రశ్నగా మిగిలింది. కాన్పూర్ పిచ్ విషయానికి వస్తే స్ఫిన్నర్లకు అనుకూలించే పిచ్. దీంతో ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, మిశ్రా, జడేజాలను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఓపెనర్ల విషయంలోనూ కెప్టెన్ కోహ్లి కసరత్తు చేయాల్సి ఉంది. విజయ్, రాహుల్, ధావన్ ఈ స్థానాల కోసం పోటీ పడుతున్నారు.

భారత్‌లో న్యూజిలాండ్ రికార్డు కూడా అంతంత మాత్రమే
అయితే ప్రస్తుత ఫామ్ చూస్తే ధావన్‌ను పక్కనపెట్టి విజయ్, రాహుల్‌కే తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇక భువనేశ్వర్ రూపంలో ఒక పేస్ బౌలర్‌తో సరిపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా, దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో పుజారా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సిఫారసుతో జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ ఎలా ఆడతాడన్నది ఆసక్తిగా మారింది. భారత్‌లో న్యూజిలాండ్ రికార్డు కూడా అంతంత మాత్రంగానే ఉంది. వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్స్ మెన్లు రాణిస్తున్నా, బౌలర్లు తేలిపోవడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఎంతో కీలకం
బ్యాటింగ్‌లో గుప్టిల్, కెప్టెన్ విలియమ్సన్, సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఎంతో కీలకం ఎవరు టాస్ గెలిచినా మొదట బ్యాటింగ్ తీసుకోవడానికే మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. కాన్పూర్ పిచ్ మూడో రోజు నుంచి రివర్స్ స్వింగ్, స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని పిచ్ నిపుణులు అంటున్నారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉండటం భారత క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. రానున్న ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో మ్యాచ్‌కు అడ్డంకులు తప్పవని తెలుస్తోంది.

ఐసీసీ అభినందనలు
చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ బీసీసీఐకి శుభాకాంక్షలు తెలిపారు. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానం వేదికగా గురువారం ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ‘భారత క్రికెట్ చరిత్రలో ఇదొక గొప్ప మైలురాయి. ఐసీసీ సభ్య దేశాల్లో భారత్ చాలా ముఖ్యమైనది. ఈ దేశ వారసత్వ సంపద, క్రికెట్ పట్ల ఉన్న ఆదరణ ఎనలేనిదని' మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ సందర్భంగా గ్రీన్‌పార్క్ స్టేడియంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ బీసీసీఐకి రజత పతకాన్ని అందజేయనున్నారు.

మీడియాతో మాట్లాడుతున్న కోహ్లీ
మ్యాచ్ ప్రారంభం:
ఉదయం 9.30 గంటలకు
ఏయే ఛానల్‌లో ప్రసారం
Star Sports 1, Star Sports 3, Star HD 1, Star HD 3
జట్ల వివరాలు:
భారతదేశం: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, చెతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షామీ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అశ్విన్, ఉమేష్ యాదవ్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, డగ్ బ్రేస్వెల్, మార్క్ క్రైగ్, బ్రేస్వెల్, మాట్ హెన్రీ, టామ్ లాథం, జేమ్స్ హెన్రీ నికోల్స్, ల్యూక్ రానోచ్, మిచెల్ షట్నర్, ఇష్ సోధీ, రాస్ టేలర్, నీల్ వాగ్నెర్ మరియు బిజె వాట్లింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications