మూడో టీ20: కోహ్లీకి పరీక్ష, ఇప్పటి వరకు సిరీస్ కోల్పోలేదు
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 బుధవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరగనుంది. ఈ సిరిస్‌ను ఇరు జట్లు 1-1తో సమం చేశాయి. దీంతో సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మ్యాచ్ కావడంతో ఇరు జట్లకు కీలకంగా మారింది.
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే, నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 చివరి ఓవర్‌లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో చివరిదైన మూడో టీ20 ఆసక్తికరంగా మారింది.
మూడో టీ20లో విజయం సాధించి సిరిస్‌ను గెలుచుకోవాలని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తీవ్రంగా కృషి చేస్తోంది. టెస్టు, వన్డే సిరిస్ ఓటమి పరాభవాన్ని మరచిపోవాలంటే టీ20 సిరిస్‌ను గెలుచుకోవాలని ఇంగ్లాండ్ జట్టు ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది.
మరోవైపు ఇంగ్లాండ్‌తో చివరి టీ20 కెప్టెన్ కోహ్లీకి ఓ పరీక్షగానే క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ధోని నుంచి కెప్టెన్సీ బాద్యతలను స్వీకరించిన తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా సొంత గడ్డపై కోహ్లి సిరీస్ కోల్పోలేదు. ఈ నేపథ్యంలో స్వదేశంలో సిరీస్‌లో ఓటమి అన్నదే లేని రికార్డును కోహ్లీ నిలబెట్టుకుంటాడా? లేదా మూడో టీ20లో తెలిసిపోతుంది.

బెంగుళూరులో ఒకటి గెలిస్తే, ఒకటి ఓటమి
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరగ్గా, అందులో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒక మ్యాచ్‌లో ఓటమి పాలుకాగా, మరొక మ్యాచ్‌లో విజయం సాధించింది. గతేడాది మార్చి 23వ తేదీన బంగ్లాతో భారత్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడింది.

ఒక పరుగు తేడాతో టీమిండియా విజయం
ఆ మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో టీమిండియా విజయం సాధించింది. 2012 డిసెంబర్ 25వ తేదీన పాకిస్తాన్‌తో జరిగిన ట్వంటీలో భారత్ 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. మూడో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌ను మారిస్తే అది జట్టుకు లాభిస్తుందని మాజీలు చెబుతున్నారు.

విజేత ఎవరో నిర్ణయించే మ్యాచ్
ఇదే విషయాన్ని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రస్తావించాడు. ఈ సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మ్యాచ్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మహేంద్ర సింగ్ ధోనిని ముందు పంపాల్సిన అవసరం ఉందని అన్నాడు. రెండో టీ20లో భారత్ గెలిచినా అది బౌలర్ల గొప్పదనమేనని, బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టుకు మంచిది కాదని పేర్కొన్నాడు.

మనీష్ పాండేను మూడో స్ధానంలో ఆడించాలి
'మనీష్ పాండేను మూడో స్ధానంలో ఆడించాలి. మిగిలి ఉన్న ఓవర్లను బట్టి రైనాను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే సరిపోతుంది. రైనాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం వల్ల చివర్లో భారీ షాట్లు ఆడే ఆటగాడిని కోల్పోతున్నాం. పాండ్యా, ధోనీ ఉన్నా.. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ ఉండడం కొంత మంచిదని నాకు అనిపిస్తోంది' అని గంగూలీ అన్నాడు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనికి ప్రమోషన్ ఇవ్వాలి
'ఇక ధోని విషయానికొస్తే కచ్చితంగా అతనికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇవ్వాలి. ఎందుకంటే అతడు మునపటిలా కాదు. ఇప్పుడు చాలా స్వేచ్చగా ఆడుతున్నాడు. అలాంటి సమయంలో కోహ్లీ అతడిని సరిగా ఉపయోగించుకుంటే జట్టు భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో కూడా ధోని సలహా తీసుకుంటే మంచిది' అని కోహ్లీకి గంగూలీ సూచించాడు.

జట్ల వివరాలు:
ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యా, పర్వేజ్ రసూల్, ఆశిష్ నెహ్రా, యుజవేంద్ర చాహాల్, జస్‌ప్రీత్ బుమ్రా, మన్దీప్ సింగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) , భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా.
ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, సామ్ బిలింగ్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్కీపర్), మొయిన్ ఆలీ, క్రిస్ జోర్డాన్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, తైమాల్ మిల్స్, జోనాథన్ బెయిర్స్టో, జేక్ బాల్, లియం డాసన్, డేవిడ్ విల్లీ.
మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications