మెల్‌బోర్న్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ20లో గెలిచిన ధోని సేన మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. వన్డే సిరిస్‌ను కోల్పోయిన టీమిండియా ఎలాగైనా సరే టీ20 సిరిస్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది.
శుక్రవారం (జనవరి 29)న మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మరోవైపు ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఏ ఫార్మెట్‌లోనైనా వెనుకబడిన ప్రతీసారి మళ్లీ అంతే స్థాయిలో ఆస్ట్రేలియా పుంజుకోవడాన్ని చాలా సందర్భాల్లో చూశాం.
కెప్టెన్ ఆరోన్ ఫించ్ రాణించడం ఆ జట్టుకు బలంగా మారింది. భారీ షాట్లకు యత్నించి తొలి టీ20లో ఆసీస్ వికెట్లను కోల్పోయింది. దీంతో రెండో టీ20లో నెమ్మదిగా ఆడాలని భావిస్తోంది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ఇందుకు ఉదాహరణగా చూపిస్తోంది. బౌలర్లు మరింత సమర్థవంతంగా బౌలింగ్ చేయాలని కెప్టెన్ సూచించారు.

ఫీల్డింగ్ తప్పిదాలను పునరావృతం చేయరాదని ఆటగాళ్లకు జట్టు కోచ్ సూచించినట్లు తెలుస్తోంది. అదనపు పరుగులు, క్యాచ్‌లు జారవిడువడం తొలి టీ20 ఓటమికి కారణాలని ఆసీస్ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. రెండో టీ20లో అవి పునరావృతం చేయకూడదని భావిస్తోంది.
దీంతో ఇరు జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు తప్పకపోవచ్చు. వన్డే సిరీస్‌ను భారత్ 1-4 తేడాతో ఓటమి పాలుకావడంతో టీమిండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి టీ20లో గెలిచిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, షాన్ మార్ష్, క్రిస్ లిన్, జేమ్స్ ఫాల్క్నర్, మాథ్యూ వేడ్ (వికెట్కీపర్), నాథన్ లియాన్, కామెరాన్ బోయ్స్, ట్రావిస్ హెడ్, జాన్ హేస్టింగ్స్, స్కాట్, కేన్ రిచర్డ్సన్, ఆండ్రూ టై, షాన్ టైట్, షేన్ వాట్సన్.
ఇండియా:
మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హార్ధిక్ పాండ్య, గురుకీర్త్ సింగ్ మాన్, రిషి ధావన్, రవీంద్ర జడేజా, అశ్విన్, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, ఉమేష్ యాదవ్, అజింక్య రహానె.
3వ వన్డే: జనవరి 31న సిడ్నీ (ఆదివారం)