మొహాలి: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టులో వికెట్ కీపర్‌గా పార్ధీవ్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని టెస్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. మూడో టెస్టు ప్రారంభానికి ముందు శుక్రవారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా విదేశాల్లో టెస్టు సిరిస్‌కు ఆడేందుకు భారత్ వెళ్లినప్పుడు రెండో వికెట్ కీపర్ స్ధానాన్ని పార్ధీవ్ పటేల్ ఈ అవకాశం ద్వారా వినియోగించుకుంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. 'పార్ధీవ్ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన సాహా గురించి ఆలోచించడం లేదు. ఇదంతా ఆటలో భాగమే. పరిస్థితిని అర్ధం చేసుకుని పార్దీవ్ జట్టులోకి వచ్చాడు' అని కోహ్లీ అన్నాడు.

'సుదీర్ఘ విరాం తర్వాత తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. విదేశాల్లో ఆడేందుకు ఇద్దరు వికెట్ కీపర్లు అవసరమైతే పార్ధీవ్‌కు ఇదొక చక్కని అవకాశం. గత కొన్నేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడు నిలకడగా రాణిస్తున్నాడు' అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
టెస్టుల్లో ఆడిన అనుభవం కూడా పార్దీవ్‌కు ఉందని కోహ్లీ తెలిపాడు. కెప్టెన్‌గా తుది జట్టుని ఎంపిక చేసే సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నాడు. శ్రీలంకతో గల్లేలే జరిగిన టెస్టులో 200 పరుగుల స్కోరుని కూడా ఛేజ్ చేయడంలో విఫలమైన సందర్భాన్ని గుర్తు చేశాడు.