
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన తర్వాత తాను ఎందుకు ఆనందం వ్యక్తం చేశాననే దానిపై కింగ్స్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతిజింటా ట్విట్టర్ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చింది.
తమ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముందుగా ముంబై ఇండియన్స్ ఓడిపోతేనే అది జరుగుతుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగానే ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత తాను సంతోషాన్ని పంచుకున్నట్లు ట్విట్టర్‌లో ప్రీతి జింటా వివరించింది. అంతేకానీ తనకు ముంబై ఇండియన్స్‌పై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని తెలిపింది.
అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించడంపై ప్రీతిజింటా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరుస పరాజయాలు తమ జట్టు ప్లేఆఫ్ అవకాశాల్ని దెబ్బ తీశాయని ఆమె పేర్కొన్నారు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన పంజాబ్ ప్లేఆఫ్‌కు వెళ్లకుండా లీగ్ దశతోనే సరిపెట్టుకోవడం తనను నిరాశకు గురి చేసిందని అన్నారు.
తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన జట్టు ప్లేఆఫ్‌కు చేరకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? అని ఆమె ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఇది తనను చాలా బాధించిందని తెలిపిన ప్రీతి జింటా కింగ్స్ పంజాబ్ అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది. వచ్చే ఏడాది ఈ తరహా పరిస్థితి రాదని అనుకుంటున్నానని ఆమె ఆశాభావం వ‍్యక్తం చేసింది.
టోర్నీలో భాగంగా ఆదివారం పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కి ముందు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది.
దీంతో ముంబై జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అదే సమయంలో తమ జట్టు మ్యాచ్ కోసం పుణెలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు ఈ విషయం తెలిసి తెగ సంబరపడింది. ఆమె మురిసిపోతూ 'నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ' అని ఆమె పేర్కొన్నట్టు వీడియోలో కనిపించింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆమెపై ముంబై అభిమానులు సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టడంతో ప్రీతి జింటా తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు వివరణ ఇచ్చుకుంది.