Preity Zinta: పంజాబ్ కింగ్స్ యజమాని, ప్రముఖ నటి ప్రీతి జింటా శనివారం సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులతో కలిసి ఆమె ఆలయాన్ని సందర్శించి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రీతి జింటా ప్రత్యేకంగా అక్షింతలు కూడా తీసుకుని వెళ్లింది. ఆలయ అధికారులు ప్రీతి జింటాకు స్వాగతం పలికారు. ఆలయానికి ప్రీతి జింటా రాకను గమనించిన భక్తులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. అయితే ప్రీతి జింటా తన ముఖం కనిపించకుండా మాస్క్ ధరించి నెత్తిపై చున్నీని కప్పుకున్నారు. ప్రీతి జింటా మధ్యాహ్నం ఆలయాన్ని సందర్శించినట్లు బోయినపల్లి ఇన్‌స్పెక్టర్ బి.లక్ష్మినారాయణ రెడ్డి ధ్రువీకరించారు.
శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు గెలవాలని కాంక్షిస్తూ.. ఆ జట్టు యజమాని ప్రీతి జింటా వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో అద్భుతంగా ఆడుతోంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు నాలుగో మ్యాచ్ లలో ఆడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. శ్రేయస్ అయ్యర్ బ్యాట్ తో అద్భుతంగా రాణిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. పంజాబ్ జట్టులో ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, నేహాల్ వధేరాలు బ్యాటింగ్ లో రాణిస్తుండగా.. అర్ష్ దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, యాన్సెన్ బౌలింగ్ లో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ జట్టు ఐదో విజయంపై కన్నేసింది.

మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో ఆశించినంతగా రాణించడం లేదు. గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన ఎస్ఆర్‌హెచ్.. ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ లలో ఒకే ఒక్క విజయం సాధించి 4 మ్యాచ్ లలో పరాజయాలను చవిచూసింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ ద్వారా గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.