Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత ప్రతిభను కనబరిచింది. పంజాబ్ కింగ్స్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెత్తగా ఆడాడు. మ్యాక్స్‌వెల్ పేలవమైన ఫామ్ కారణంగా అభిమానుల నుంచి ట్రోల్స్‌కు గురవుతున్నాడు. అయితే తాజాగా మ్యాక్స్‌వెల్ చెత్త ప్రదర్శనపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటాను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ వచ్చాయి. ఒక నెటిజన్ "మేడమ్.. మ్యాక్స్‌వెల్ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు కాబట్టే.. మీ జట్టు తరఫున అంత బాగా ఆడడం లేదు." అని నీచంగా కామెంట్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రీతిజింటా.. ఆ యూజర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ప్రీతి జింటా షాకింగ్ కౌంటర్
వాస్తవానికి పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌ను నిర్వహించారు. దీనిలో ఒక నెటిజన్ తన జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గురించి ఒక ప్రశ్న అడిగారు. ఇది ప్రీతి జింటాకు చాలా కోపాన్ని తెప్పించింది. ఈ క్రమంలో ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

అసలు ప్రశ్న ఏమిటంటే.. 'మీరు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను వివాహం చేసుకోలేదు.. అందుకే అతను మీ జట్టుకు బాగా ఆడటం లేదు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఆగ్రహంతో స్పందించిన ప్రీతి జింటా.. " నువ్వు ఈ ప్రశ్నను ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోని పురుష యజమానులను అడగగలవా? లేదంటే మహిళను కాబట్టి నా పట్ల ఇలా వివక్షపూరితంగా కామెంట్ చేస్తున్నావా? క్రికెట్‌లోకి వచ్చేవరకు కార్పొరేట్ సెటప్‌లో మహిళలు మనుగడ సాగించడం ఎంత కష్టమో నాకు తెలియదు. నువ్వు ఈ ప్రశ్నను సరదాగా అడిగావని కచ్చితంగా అనుకుంటున్నాను. కానీ దయచేసి ఇలా చెత్తగా ప్రవర్తించవద్దు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నిజంగా అర్థం చేసుకుంటే.. ఇది మంచి ప్రశ్న కాదు. గత 18 ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పేరుకు కాస్త గౌరవం ఇవ్వండి. లింగ పక్షపాతాన్ని ఆపండి. ధన్యవాదాలు" అంటూ ప్రీతి జింటా ఆ యూజర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఐపీఎల్ 2025లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రదర్శన ఎలా ఉంది?
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్‌కు ముందు వేలంలో పంజాబ్ కింగ్స్ మ్యాక్స్‌వెల్‌ను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. మ్యాక్స్‌వెల్ 7 మ్యాచ్‌ల్లో 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇది కాకుండా గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.