
న్యూఢిల్లీ: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠతను రేపిందో తెలుసు. టాస్ ఓడిపోయి, తొలుత బౌలింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు టీమిండియా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపింది. ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. బ్యాట్స్‌మెన్లను క్రీజులోనే కట్టిపడేశారు. అడపా, దడపా వికెట్లను పడగొడుతూ అత్యుత్తమ ప్రతిభ చూపారు. అసాధారణంగా రాణించారు. ఫలితంగా- భారత క్రికెట్ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి, 224 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్లు కూడా దాదాపు టీమిండియా తరహాలోనే వ్యవహరించారు. పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. భారీ షాట్లు ఆడటానికి సాహసించలేకపోయారు. యార్కర్ కింగ్ జస్‌ప్రీత్ బూమ్రా, స్వింగ్ మాస్టర్ మహమ్మద్ షమీ, స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్‌లకు దాసోహం అన్నారు. చివరి ఓవర్‌లో షమీ హ్యాట్రిక్ తీసుకోవడంతో భారత జట్టు చేతిలో ఆఫ్ఘనిస్తాన్ 11 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.
మ్యాచ్ మొత్తం మీద చూసుకుంటే- బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అటు టీమిండియా, ఇటు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అత్యత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఈ అంశం ప్రముఖ బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంఛైజీ యజమాని ప్రీతిజింతాను విపరీతంగా ఆకట్టుకుంది. బౌలర్లను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే- ఇరు జట్ల బౌలర్లకు కితాబులిస్తూ ట్వీట్ చేశారు. హ్యాట్రిక్ సాధించిన మహమ్మద్ షమీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న జస్‌ప్రీత్ బూమ్రాను ప్రశంసించారు. అద్భుతంగా ఆడారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ సైతం మొండిగా పొరాడిందని చెప్పారు. ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదని అన్నారు.