
ముంబై: బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరుపై అజింక్య రహానే సొంత పరిశోధన చేసుంటాడని అతడి కోచ్ ప్రవీణ్ ఆమ్రె అన్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ప్రయోగించడం తెలివైన ఎత్తుగడని ప్రశంసించారు. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ రనౌట్‌కు కారుకుడై, తక్కువ పరుగులే చేసిన రహానే తర్వాతి టెస్టుకు సారథ్యం వహిస్తుండటంతో కాస్త భయం వేసిందని ప్రవీణ్ పేర్కొన్నారు. బాక్సింగ్ డే టెస్టులో రహానే జట్టును అద్భుతంగా నడిపించిన విషయం తెలిసిందే. తొలిరోజు 10 ఓవర్లు పూర్తికాగానే అశ్విన్ చేతికి బంతినిచ్చి ఫలితాన్ని అందుకున్నాడు.
నిజం చెప్పాలంటే మెల్‌బోర్న్ టెస్టు వరకు అజింక్య రహానే ఫామ్‌లో లేడు. అంతకు ముందు గతేడాది మార్చిలో జరిగిన న్యూజిలాండ్ సిరీసులో పెద్దగా రాణించలేదు. డే నైట్ టెస్టులో జట్టు మెరుగ్గా ఉన్న స్థితిలో విరాట్ కోహ్లీ రనౌట్‌కు కారకుడయ్యాడు. అదే మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. చివరకు భారత్ ఓటమి పాలవ్వడంతో కోహ్లీ లేని జట్టు అస్సలు పుంజుకోలేదని, 4-0తో సిరీస్ ఇచ్చేసి వెళుతుందని ఆసీస్ మాజీలు కామెంట్లు చేశారు. రెండో టెస్టులో రహానే అద్భుతంగా ఆడడమే కాదు.. సారథ్యం కూడా వావ్ అనిపించాడు. తెలివైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఉమేశ్ యాదవ్ లేకున్నా..ఆసీస్ జట్టుపై ఒత్తిడి పెంచాడు. మొత్తానికి సారథిగా మరో విజయాన్ని అందుకుని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సరసన చేరాడు.
తాజాగా ప్రవీణ్ ఆమ్రె మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా సిరీసుకు ముందు న్యూజిలాండ్‌లో రహానే గొప్పగా పరుగులు చేయలేదు. ఇక తొలి టెస్టులో కోహ్లీ రనౌట్‌కు కారకుడయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. దాంతో నాకు ఆందోళన కలిగింది. ఆ వెంటనే రెండో టెస్టుకు నాయకత్వం వహించడం సాధారణ విషయం కాదు. మైదానంలో వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు నాయకులు ఉంటారు. కానీ చివరికి సమాధానం చెప్పాల్సింది మాత్రం కెప్టెన్ మాత్రమే. ఆ పాత్రను జింక్స్ అద్భుతంగా పోషించాడు' అని అన్నారు.
'మెల్‌బోర్న్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను రహానే బాగా అధ్యయనం చేసిఉంటాడు. ఎందుకంటే ఆసీస్ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో అంతగా ఆడలేదు. తొలిరోజు ఆర్ అశ్విన్‌తో బౌలింగ్ చేయించడమే టర్కింగ్ పాయింట్. దీనిని ఎవరూ ఊహించలేదు. సరైన ప్రాంతాల్లో ఫీల్డర్లను మోహరించి ఒత్తిడి పెంచారు. మూడో టెస్టులో ఆసీస్ పుంజుకొనేందుకు ప్రయత్నిస్తుంది. అయితే భారత్ మాత్రం స్వేచ్ఛగా ఆడాలి' అని ప్రవీణ్ ఆమ్రె సూచించారు.