
విరాట్ కోహ్లీ అండర్ 19 జట్టుకు ఆడే సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనన నాటి అతని రూమ్ మేట్ ప్రదీప్ సంగ్వాన్ ఓ క్రీడా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ తాను జూనియర్ క్రికెట్లో ఎనిమిదేళ్లపాటు రూమ్ షేర్ చేసుకున్నట్లు చెప్పాడు. విరాట్ కోహ్లీ ఇండియా అండర్ 19 జట్టు కెప్టెన్‌గా సౌతాఫ్రికాలో ప్రపంచకప్ ఆడుతున్న సమయంలో తాను విరాట్ కోహ్లీ రూమ్‌మేట్స్‌మని ప్రదీప్ తెలిపాడు. విరాట్ కోహ్లీకి స్ట్రీట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టమని, కోర్మా రోల్స్, చికెన్ రోల్స్ లాంటివి బాగా తినేవాడని ఆయన చెప్పాడు. అయితే తాము బస చేసిన హోటల్‌కు కొద్ది దూరంలో రుచికరమైన మటన్ రోల్ దొరుకుంతుందనే విషయం విరాట్ కోహ్లీ చెవిన పడిందని తెలిపాడు. తమ కార్ డ్రైవర్ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు వెల్లడించాడు. కానీ అక్కడ ఈ మధ్య ఓ గొడవ జరిగిందని, ఆ గొడవలో ఓ వ్యక్తి చేయి కూడా నరికినట్లు ఆ డ్రైవర్ చెప్పాడని ప్రదీప్ తెలిపాడు.
దీంతో తాను అక్కడికి వెళ్లడానికి చాలా భయపడినట్లు ప్రదీప్ సంగ్వాన్ చెప్పాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఏం కాదని వెళ్దామని తనను ఒప్పించి తీసుకెళ్లాడని చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లి భోజనం చేసినట్లు తెలిపాడు. అయితే తిరిగొచ్చే క్రమంలో కొందరు దుండగులు తమను వెంబడించారని తెలిపాడు. దీంతో వెంటనే కార్ స్టార్ట్ చేసి తాము బస చేసే హోటల్ వరకు ఎక్కడ ఆగకుండా వచ్చినట్లు ప్రదీప్ సంగ్వాన్ గుర్తు చేసుకున్నాడు. అయితే టీమిండియాకు ఎంపికయ్యాక విరాట్ కోహ్లీ డైట్ విషయంలో చాలా స్ట్రిట్‌గా ఉన్నాడని, బరువు తగ్గడానికి మటన్ రైస్ వంటివి పక్కనపెట్టి, మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు, సలాడ్లు, డ్రైప్రూట్స్ లాంటివి తీసుకునేవాడని ఆయన చెప్పాడు. దీంతో 3 నెలల్లోనే విరాట్ కోహ్లీ 12 కిలోలు బరువు తగ్గినట్లు ప్రదీప్ తెలిపాడు. శరీరం ఫ్లెక్సీబుల్‌గా ఉంటేనే మైదానంలో చురుగ్గా కదలగలమని విరాట్ కోహ్లీ చెప్పేవాడని ఆయన చెప్పాడు.
కాగా 2008లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఆ అండర్ 19 ప్రపంచకప్‌ను విరాట్ కోహ్లీ నేతృత్వంలోని యువ భారత్ గెలుచుకుంది. నాటి జట్టులో ప్రస్తుతం భారత జట్లులో ఉన్న రవీంద్ర జడేజా, సౌరభ్ తివారీ, మనీష్ పాండే, సిధార్థ్ కౌల్ కూడా తదితరులు ఉన్నారు.