
హైదరాబాద్: ఆగష్టు 1వ తేదీ నుంచి ప్రాక్టీసు మ్యాచ్ మొదలవబోతుండగా.. కోహ్లీ సేన ప్రాక్టీస్ రద్దయ్యింది. షెడ్యూల్‌లో భాగంగా ఆదివారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనాల్సి ఉంది. ఐతే, వర్షం కారణంగా మొత్తం ప్రాక్టీస్ సెషన్ రద్దయ్యింది. బుధవారం నుంచి ఎసెక్స్ జట్టుతో చెమ్స్‌ఫోర్డ్‌లో వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం కోహ్లీ సేన ఆదివారం బర్మింగ్‌హామ్ చేరుకుంది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ బుధవారం(ఆగస్టు 1న) నుంచి ప్రారంభంకానుంది. బర్మింగ్ హామ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఆదివారం తొలి టెస్టు జరిగే మైదానంలో ప్రాక్టీస్ చేయాలనుకోగా వారికి వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మొత్తం ప్రాక్టీస్ సెషనే రద్దవ్వడంతో ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ పిచ్‌పై ప్రాక్టీస్ చేసేందుకే భారత్ నాలుగు రోజుల సన్నాహక మ్యాచ్‌ను మూడు రోజులకు తగ్గించింది. ఒకరోజు తగ్గించడంతో ప్రాక్టీసు మ్యాచ్ పూర్తి చేయాలని భావించింది. కానీ, వరుణుడు మాత్రం అడ్డుపడ్డాడు. ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచి వన్డే సిరీస్ ఓడిన భారత్ ఎలాగైనా టెస్టు సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
గత రెండు పర్యటనల్లో భారత్‌కు దారుణ పరాభవాలు చూపింది ఇంగ్లిష్ జట్టు. ఐతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంగ్లాండ్ బలం తగ్గింది. సొంత గడ్డపై ఆసీస్, న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్‌లను చేజార్చుకోగా పాక్‌తో సిరీస్‌ను డ్రా చేసుకుంది.