
డబ్బు సంపాదనకు జూదం లేదా బెట్టింగ్ ఎప్పుడూ సరైన మార్గం కాదు. కానీ క్రికెట్ ప్రపంచంలో బెట్టింగ్ అనే మహమ్మారి మాత్రం డబ్బు సంపాదించాలనే యావను కొందరిలో కలిగించి వారిని తప్పుడు మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. తద్వారా చాలా సందర్భాల్లో బెట్టింగ్ మాయలో పడి ఎందరో ఇల్లుగుల్ల చేసుకున్న సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా మధ్యప్రదేశ్లో అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని బినా సబ్-పోస్టాఫీసులో పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసిన విశాల్ అహిర్వార్ ఐపీఎల్‌లో బెట్టింగ్ కోసం 24కుటుంబాల ఫిక్స్‌డ్ డిపాజిట్లను దారిమళ్లించాడు.
ఫలితంగా రూ.కోటికి పైగా గోల్ మాల్ చేశాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ నిషేధించబడినప్పటికీ.. ఐపీఎల్ టైంలో మాత్రం జోరుగా జరుగుతుంటుంది. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నష్టానికి గురైన కుటుంబాలు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ల సొమ్మును సాగర్ జిల్లా సబ్-పోస్టాఫీసులో డిపాజిట్ చేయాలని అహిర్వార్ ను సంప్రదించగా.. అతను నకిలీ రసీదులను ఇచ్చి వారి నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యవ్వారం కొనసాగించాడు.
అహిర్వార్ చాలా తెలివిగా ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే ఖాతాదారులకు నకిలీ స్టాంప్ రసీదులను ఇచ్చి బురిడీ కొట్టించాడు. అయితే కొందరు డిపాజిటర్లు తమ డబ్బును విత్ డ్రా చేసుకోవాలని చూడగా..వారి ఫిక్స్ డ్ డిపాజిట్లు అకౌంట్లలో నమోదు కాలేదని పోస్ట్ ఆఫీస్ అధికారులు వారికి తెలియజేశారు. దీంతో అహిర్వార్ బండారం బయటపడింది.
ఎట్టకేలకు అహిర్వార్ ను పోలీసులు పట్టుకుని అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 420 (మోసం), 408 (క్రిమినల్ ట్రస్ట్ ఆఫ్ ట్రస్ట్) కింద అభియోగాలు మోపారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు బినా-జిఆర్‌పి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ ధుర్వే చెప్పారు. తదుపరి పరిశీలన విచారణ అనంతరం కేసును మరింత పొడిగించే వీలుంది.
సదరు పోస్టాఫీసు ఇన్ ఛార్జి అధికారి ధుర్వే చెప్పిన దాన్ని బట్టి బోగస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను జారీ చేస్తూ.. గత రెండేళ్లుగా ఐపీఎల్ బెట్టింగ్‌లో మొత్తం డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. గత రెండేళ్లలో.. అహిర్వార్ దాదాపు రూ.2కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తాన్ని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు ఉపయోగించారు. అందులో రూ.కోటీ వరకు నష్టపోగా మిగతా సొమ్ము అతని వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారి మధ్యప్రదేశ్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఐపీఎల్ బెట్టింగ్ జరిగే స్థలాలపై తనిఖీలు వేగవంతం చేశారు. పింపుల్ సౌదాగర్‌లోని ఓ ఫ్లాట్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై పింప్రీ చించ్‌వాడ్ పోలీసులు సోమవారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 30సెల్‌ఫోన్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5లక్షల రూపాయలకు పైగా డబ్బును సీజ్ చేశారు. ఇకపోతే పోస్ట్ మాన్ అహిర్వార్ నిర్వాకం కారణంగా కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్న కుటుంబాల పరిస్థితి ఏంటనే విషయమై ఇంకా ఏమీ తెలియడం లేదు.