టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ సేన స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జూన్ 29నే ఫైనల్ ముగిసినప్పటికీ భీకర తుఫాను కారణంగా బార్బడోస్‌లోనే టీమిండియా నాలుగు రోజుల పాటు వేచి ఉంది.
పరిస్థితి కాస్త సద్దుమణగడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఎయిర్ ఇండియా ఛార్టర్ ఫ్లైట్ AIC24WCలో టీమిండియా స్వదేశానికి ఎట్టకేలకు వచ్చింది. బుధవారం బయలుదేరి సుమారు 16 గంటల పాటు ప్రయాణించింది. అనంతరం ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్‌సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు.

మరోవైపు టీమిండియా కూడా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో భారత ఆటగాళ్లు అలరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశారు. అయితే వన్డే వరల్డ్ కప్-2023 విజయానంతరం ఆస్ట్రేలియాకు దక్కిన స్వాగతానికి, ఇప్పుడు టీమిండియాకు దక్కుతున్న ఆదరణను పోలుస్తూ నెట్టింటలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయ.
గతేడాది నవంబర్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే కప్‌తో స్వదేశానికి చేరుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లకు నిరాశే మిగిలింది. అభినందించడానికి ఎయిర్‌పోర్ట్‌కు అభిమానులే రాలేదు. కానీ రోహిత్ సేనకు గ్రాండ్ వెల్‌కమ్ పలకడానికి బుధవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం విశేషం. టీమిండియా ఎక్కడికి వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.
కాగా, స్వదేశానికి చేరుకున్న టీమిండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లు అల్ఫాహారం తిన్నారు. విశ్వవేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను మోదీ అభినందించారు. ప్రధానితో సమావేశం ముగిసిన తర్వాత భారత జట్టు ముంబైకి బయల్దేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో ప్రారంభమవుతుంది. రెండు గంటల పాటు ఊరేగింపు జరగనుంది. ఆ తర్వాత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం జరగనుంది.