స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ టీ20 ఫార్మాట్‌లో చెలరేగింది. మూడో టీ20లోనూ సఫారీలపై ఆధిపత్యం చెలాయించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ నెలలో సౌతాఫ్రికాకు ఆతిథ్యం ఇచ్చిన వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్‌ను 0-1తో కోల్పోయిన విషయం తెలిసిందే.
కాగా, ట్రిండాడ్ వేదికగా జరిగిన ఈ మూడో టీ20కి వరుణుడు అంతరాయం కలిగించాడు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4.3 ఓవర్లకు 23/0తో ఉన్నప్పుడు వర్షం పడింది. దీంతో మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించాలని అంపైర్లు నిర్ణయించారు. సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్‌కు 13 ఓవర్లకు 116 పరుగులుగా నిర్ణయించారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో యువ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ (40; 15 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ మార్క్‌రమ్ (20; 12 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్) ఫర్వాలేదనిపించగా.. మిగిలిన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ 9.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
షై హోప్ (42 నాటౌట్; 24 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (35; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హెట్‌మెయిర్ (31 నాటౌట్, 17 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. పూరన్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. అయితే ఛేదనలో వెస్టిండీస్‌కు పేలవారంభం లభించింది. ఓపెనర్ అథంజె (1; 3 బంతుల్లో) తొలి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. కానీ హోప్‌తో కలిసి పూరన్ బౌండరీ, సిక్సర్లతో విరుచుకుడ్డాడు. పూరన్ ఔటైనా అదే జోరును హెట్‌మెయిర్ కొనసాగించాడు.