Ricky Ponting: కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది అతడే.. టెస్ట్ కెప్టెన్‌గా ఆ ఆటగాడే కరెక్ట్

టీమిండియాకు టెస్టు ఫార్మాట్లో కాబోయే కెప్టెన్ ఎవరనే అంశంపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ స్పందించాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగిస్తే బాగుంటుందని సూచించాడు. కెప్టెన్‌గా ఇప్పటికే హిట్‌మ్యాన్ తనను తాను నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చాడు. అలాగే 2013లో ఐపీఎల్‌లో రోహిత్‌శర్మను ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించమని తానే సూచించాని పాంటింగ్ తెలిపాడు.

రోహిత్‌కే ఆ సత్తా ఉంది
2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కోసం వేలంలో తనను కొనుగోలు చేసిన విషయాన్ని రికీ పాంటింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. కానీ తాను రాణించలేకపోయాననని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన స్థానంలో కెప్టెన్‌గా ఎవరిని నియమించాలని జట్టులో చర్చ జరిగినట్టు తెలిపాడు. అప్పుడు పలువురి పేర్లు చర్చకు వచ్చినట్టు చెప్పాడు. అయితే తాను యువకుడైన రోహిత్ శర్మకు ఆ బాధ్యత అప్పగించాలని సూచించినట్లు తెలిపాడు. అలాగే ఆ సీజన్లో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌ను చేశారు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది. అప్పటి నుంచి ముంబై జట్టులో రోహిత్‌శర్మను తాను దగ్గరి నుంచి గమనించానని పాంటింగ్ చెప్పాడు. అతని కెప్టెన్సీలో ముంబై 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిందని అన్నాడు. అలాగే భారత జట్టు కెప్టెన్‌గా కూడా హిట్‌మ్యాన్ తనను తాను నిరూపించుకున్నాడని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగలిగే సత్తా రోహిత్ శర్మకే ఉందని ఆయన తెలిపాడు. అలాగే రెండు, మూడేళ్లుగా భారత టెస్ట్ జట్టులో కూడా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ స్థిరంగా రాణిస్తున్నాడని పాంటింగ్ గుర్తు చేశాడు.

అతనికి కూడా అవకాశం
అజింక్యా రహానేకు కూడా టెస్ట్ కెప్టెన్‌గా మంచి మార్కులే పడతాయని పాంటింగ్ చెప్పాడు. కోహ్లీ గైర్హాజరీలో అతడు చేపట్టిన కెప్టెన్సీ విధానమే ఇది చెబుతుందని తెలిపాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో రహానే కెప్టెన్సీలోనే టీమిండియా టెస్ట్ సిరీస్ గెలిచిందని గుర్తు చేశాడు. అతని కెప్టెన్సీ సత్తా ఏంటో ఆ పర్యటనలో తెలిసిందని అన్నాడు. అయితే ప్రస్తుతం రహానే బ్యాటర్‌గా ఫామ్‌లో లేకపోవడం నిరాశ కల్గించే అంశమని చెప్పాడు. కేఎల్ రాహుల్ పేరు కూడా కెప్టెన్‌గా చర్చకు వస్తుందని, విదేశాల్లో అతనికి మంచి రికార్డు ఉందని అన్నాడు.

కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టగలడు
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పాంటింగ్ తెలిపాడు. ప్రస్తుతం కెప్టెన్సీకి దూరమైన విరాట్ కోహ్లీకి బ్యాటర్‌గా రాణించేందుకు మంచి అవకాశం ఉందని చెప్పాడు. కెప్టెన్సీ భారం లేదు కాబట్టి 33 ఏళ్ల విరాట్ కోహ్లీ బ్యాటర్‌గా అనేక రికార్డులను బద్దలు కొట్టగలడని ఆయన అంచనా వేశాడు. అతను కనీసం మరో 5 ఏళ్లు క్రికెట్ ఆడతాడని చెప్పుకొచ్చాడు. కాగా త్వరలోనే బీసీసీఐ టీమిండియా టెస్ట్ కెప్టెన్‌ను ఎంపిక చేయనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications