బెంగుళూరు: మహిళపై దాడి చేసిన ఆరోపణల కేసులో టీమిండియా స్ఫిన్నర్ అమిత్ మిశ్రాకు ఊరట లభించింది. బెంగళూరులోని హోటల్ లో తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ మిశ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.
బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అమిత్ మిశ్రాపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వ్యక్తిగంతా హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

బెంగుళూరులోని ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో అమిత్ మిశ్రాపై కేసు నమోదైందని, ఆ కాపీని బీసీసీఐకు పంపించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బీసీసీఐ మిశ్రాపై విచారణకు బుధవారం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, అమిత్ మిశ్రా చిక్కుల్లో పడ్డారని అందరూ భావించారు. తాజాగా అమిత్ మిశ్రాపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నానని సదరు మహిళ తెలిపింది. తాను, మిశ్రా ఇద్దరం మంచి స్నేహితులమని, ఇకపై కూడా మంచి మిత్రులుగా కొనసాగుతామని చెప్పింది. దీంతో, మిశ్రాకు ఊరట లభించింది.