ఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ క్రికెట్ జట్టు సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ యువతకు సూచించారు. సానుకూల మనస్తత్వం సానుకూల ఫలితాలను ఇస్తుందన్నారు. తక్కువ అనుభవంతో కూడా సవాళ్లపై పోరాడాలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై దృఢమైన విశ్వాసంతో పోరాడాలంటూ.. టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని ఉదాహరణగా చూపారు. తేజ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందిన విద్యార్థులను ఉద్దేశించి శుక్రవారం ప్రధాని మాట్లాడారు.
'ఎన్నో సవాళ్ల మధ్య టీమిండియా గబ్బా టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మొదటి పరీక్షలో ఓడిపోయిన తరువాత కూడా పోరాటం కొనసాగించారు. గాయాలు వెంటాడినా కొత్త పరిష్కారాలను కనుకొన్నారు. జట్టు సభ్యుల అనుభవం తక్కువే అయినా.. వారి ఆత్మవిశ్వాసం అమోఘం. దాంతోనే చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం ఒక జీవిత పాఠం. సానుకూల ఫలితాలను రాబట్టేందుకు సానుకూల మనస్తత్వం ఎంతో అవసరం. ఇదే ఆత్మనిర్భర్ భారత్ సారం' అని ప్రధాని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.
'కరోనా మహమ్మారి ప్రారంభ దశలో ఏం జరుగుతుందోనని ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ దేశం దృఢత్వాన్ని చూపింది. మేడిన్ ఇండియా పరిష్కారాలతో కరోనాతో పోరాడాం' అని ప్రధాని మోదీ అన్నారు. దేశీయంగా తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ కరోనా టీకా గురించి ఆయన మాట్లాడారు. మన శాస్త్రవేత్తలపై నమ్మకం ఫలితమే ఈ టీకాలన్నారు. స్వాతంత్రం పొంది 75వ సంవత్సరంలోకి ప్రవేశించనున్నామని, ఇప్పుడు కొత్త భారతంలో జీవించాలన్నారు. ఇప్పటి నుంచి ఇది యువతకు స్వర్ణయుగమని మోదీ చెప్పుకొచ్చారు.
తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన టీమ్ఇండియా ఇక కోలుకోవడం కష్టమే అనుకుంటే.. గోడకు కొట్టిన బంతిలా మిగిలిన మూడు మ్యాచ్ల్లో రెండింట నెగ్గి సిరీస్ చేజిక్కించుకుంది. కెప్టెన్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరుగు పయనమైనా.. అతడి స్థానంలో పగ్గాలు అందుకున్న రహానే జట్టును అద్భుతంగా ముందుకు నడిపాడు. నయావాల్ చతేశ్వర్ పుజారా గురించి ఎంతచెప్పినా తక్కువే. మూడో టెస్టు డ్రా కావడంతో పాటు నాలుగో టెస్టు చివర్లో ఆసీస్ పేసర్లు అలసిపోయేందుకు ప్రధాన కారణం అతడే. ఇక గిల్, పంత్ భయం లేని బ్యాటింగ్.. సుందర్, శార్దూల్ ఆల్రౌండ్ నైపుణ్యం భారత జట్టు భవిష్యత్తుపై భరోసానిచ్చాయి. అందరూ హీరోలవ్వడంతో కంగారూ గడ్డపై భారత్ రెండోసారి చిరస్మరణీయ విజయం సాధించింది.
టైగర్ పటౌడీని గుర్తుచేశాడు.. రహానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి!! కోహ్లీ ఇక వద్దు!