
ఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా మైదానంలోనే పోటీదారులని, బయట మాత్రం రెండు దేశాల బంధం దృఢమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూల గడ్డపై మంగళవారం చిరస్మరణీయ విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన పీఎం మోదీ.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
'ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గొప్ప విజయాన్ని నమోదు చేసిన భారత క్రికెట్ జట్టుకు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. ఆటలోని అత్యుత్తమ రెండు జట్లు, ఆటగాళ్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటం ఇది. ఆసీస్ జట్టు కూడా వీరోచితంగా ఆడింది. ఈ ఓటమి నుంచి టిమ్ పైన్, ఆస్ట్రేలియా టెస్టు బృందం తేరుకొని బలంగా పుంజుకుంటుంది' అని స్కాట్ మారిసన్ ట్వీట్ చేశారు.
స్కాట్ మారిసన్ ట్వీట్‌పై పీఎం మోదీ స్పందిస్తూ... 'కృతజ్ఞతలు స్కాట్ మారిసన్‌జీ. ఈ అడుతమైన సిరీస్‌లో ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి. ఉత్తమ ప్రదర్శన ఇచ్చాయి. భారత్, ఆస్ట్రేలియా.. మైదానంలో మాత్రమే బలమైన పోటీదారులు. మైదానం వెలుపల దృఢమైన భాగస్వామ్యం కలిగిన దేశాలు' అని పేర్కొన్నారు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు అందరూ సత్తాచాటడంతో 2-1తో టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియాతో గులాబి టెస్టులో తేలిపోయింది కోహ్లీసేన. ఫలితం 0-1తో సిరీసులో వెనకబాటు. పితృత్వ సెలవులకు వెళ్లిన విరాట్ కోహ్లీ. గెలుపు అవకాశాలున్న అడిలైడ్‌లోనే చెత్తగా ఓడారంటే.. సిరీసులో 0-4తో క్లీన్‌స్వీప్ కావడం పక్కా. ఇదీ ఆసీస్ దిగ్గజాలు, మాజీల మైండ్‌గేమ్. కానీ భారత్ వాటన్నిటికీ తన ఆటతోనే సమాధానమిచ్చింది. మెల్‌బోర్న్‌లో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక గాయాలు వేధించినా సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది. గబ్బాలో గర్జించి సిరీస్ ఏజెరుసుకుపోయింది.