కోహ్లీ, అశ్విన్‌లకు కంగ్రాట్స్: మన్‌కీ బాత్‌లో మోడీ
హైదరాబాద్: ఆదివారం (డిసెంబర్ 25)నాడు తన మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భారత క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో టెక్నాలజీని ఉపయోగించడం, క్యాష్ లెస్ ఎకానమీ దిశగా దేశాన్ని తీసుకెళ్లడం లాంటి తదితర విషయాలపై ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఈ ఏడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. 'మిత్రులారా.. గత కొన్ని వారాలుగా క్రీడా లోకం నుంచి వస్తున్న వార్తలు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయి. భారతీయులుగా మనందరం ఎంతో సంతోషించాలి. క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 4-0తో గెలిచింది. ఈ ఘన విజయంలో కొందరు యువ ఆటగాళ్లు ప్రత్యేక అభినందనలకు అర్హులు. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించగా లోకేష్ రాహుల్ 199 పరుగులు చేశాడు. కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతోపాటు స్ఫూర్తిదాయక కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. ఐసీసీ అవార్డులు గెల్చుకున్న అశ్విన్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని మోడీ అన్నారు.
భారత పురుష, మహిళా క్రీడాకారులు దేశం గర్వించేలా చేశారని అన్నారు. వరల్డ్‌కప్ నెగ్గిన జూనియర్ హాకీ టీమ్‌ను ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. రియో పారాలింపిక్స్‌లో నాలుగు పతకాలను సాధించిన క్రీడాకారుల ప్రదర్శనను సైతం ఆయన మెచ్చుకున్నారు.

ఇంగ్లాండ్‌పై 4-0తో సిరిస్ కైవసం
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇంగ్లాండ్‌పై 4-0తో టీమిండియా కైవసం చేసుకుని ఈ ఏడాది టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో ముగించింది. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరిస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రెండు టాప్ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

అశ్విన్‌కు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ట్రోఫిని అందుకున్న 12వ ఆటగాడు కాగా, భారత ఆటగాళ్లలో మూడోవాడు.అంతకుముందు ద్రవిడ్(2004), సచిన్(2010) ఈ ట్రోఫీని అదుకున్నారు.

అశ్విన్ మరో అరుదైన ఘనత
అయితే ఈ క్రమంలో అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే ఏడాది ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని దక్కించుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. 2004లో రాహుల్ ద్రవిడ్ కూడా ఒకేసారి ఈ రెండు ఘనతలను సాధించాడు.
కోహ్లీకి చోటు లభించకపోవడంపై తీవ్ర విమర్శలు
ఇక ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో విరాట్ కోహ్లీకి చోటు లభించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. అంతేకాదు క్రికెట్ ఆస్ట్రేలియా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకోవడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications