
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఓ క్రికెటర్‌గా తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నందుకు తన దేశ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలను చెబుతున్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా న్యూజీలాండ్ టీమ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ టీమ్ 237 పరుగులు చేసింది. బ్లాక్స్ క్యాప్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడానికి బరిలో దిగిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్.. 49.1 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి జయ కేతనాన్ని ఎగురవేసింది. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ వరుసగా సాధించిన రెండో విజయం ఇది.
అద్బుతం..ఈ విజయం
ఈ విజయం ఇమ్రాన్ ఖాన్‌ను అబ్బురపరిచింది. ఆనందంలో నింపేసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన తన ట్విట్టర్‌కు పనిచెప్పారు. సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని తన దేశ జాతీయ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి- బాబర్ ఆజమ్, హరీస్ సొహైల్, షహెన్‌షా అఫ్రిదీల పేర్లను ఆయన తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ఈ ముగ్గురూ న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. మిగిలిన మ్యాచుల్లోనూ ఇదే గెలుపు స్ఫూర్తిని కొనసాగించాలని ఇమ్రాన్ ఖాన్ అకాంక్షించారు. పాకిస్తాన్ ఇప్పటిదాకా ఒకే ఒక్క ప్రపంచకప్‌ను అందుకుంది. 1992 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి కప్పును ఎగరేసుకెళ్లింది. నాటి పాకిస్తాన్ జట్టుకు కేప్టెన్‌గా ఉన్నది ఇమ్రాన్ ఖాన్ అనే విషయం తెలిసిందే.
కీపిటప్ బోయ్స్..!
న్యూజీలాండ్‌పై సాధించిన ఘన విజయంతో 1992 నాటి చరిత్ర పునరావృతం అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు తన మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ ఇదే తరహా స్ఫూర్తిదాయక విజయాలను అందుకోవాలని కోరుతున్నారు. 1992లో సైతం వరుస ఓటములతో తన ప్రస్థానాన్ని ఆరంభించిన పాకిస్తాన్.. చివరికి ప్రపంచకప్‌ను గెలుచుకుందని, చరిత్ర మళ్లీ పునరావృతం అవుతోందని మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, జావెద్ మియాందాద్, రమీజ్ రజా తదితరులు వ్యాఖ్యానిస్తున్నారు. సర్ఫరాజ్ అహ్మద్ సేనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. పాకిస్తాన్ బౌలంగ్ విభాగానికి షహెన్‌షా అఫ్రిది రూపంలో ఓ సరికొత్త సంచలనం దొరికిందని, హారిస్ సొహైల్ రాకతో మిడిలార్డర్ బలోపేతమైందని అంటున్నారు.