టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఓ మహిళ భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చి రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఇటీవల రోహిత్ శర్మ ఇండోర్‌లో టీమ్ హోటల్లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రోహిత్ శర్మ వస్తున్న సమయంలో ఓ మహిళ భద్రతా సిబ్బందిని తప్పించుకుని అకస్మాత్తుగా ఆయన వద్దకు వచ్చి చేయి పట్టుకుని తన వైపు లాగింది. అప్రమత్తంగా లేని రోహిత్ శర్మ ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్నారు. వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఆమెను పక్కకు తప్పించారు.

ఎందుకు అలా చేసింది?.. కన్నీళ్లు పెట్టించే కారణం!
ఆ మహిళ పేరు సరిత శర్మ. ఆమె రోహిత్ శర్మను ఇబ్బంది పెట్టాలనో లేదా సెల్ఫీ కోసమో అలా చేయలేదని తర్వాత వెల్లడైంది. ఆ మహిళ తన కూతురి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆవేదనతోనే ఆమె అంత సాహసం చేసినట్లు తెలిసింది. సరిత కూతురు అనిక ఓ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను కాపాడుకోవాలంటే అమెరికా నుంచి ఓ ఇంజెక్షన్ దిగుమతి చేసుకోవాలి. ఆ ఇంజెక్షన్ ధర అక్షరాలా 9 కోట్ల రూపాయలు. చిన్న చిన్న క్యాంపుల ద్వారా ఇప్పటివరకు ఆమె 4.1 కోట్ల రూపాయలు సేకరించగలిగింది. ఇంకా దాదాపు రూ.5 కోట్లు అవసరం. సమయం మించిపోతుండటంతో ఆమె తీవ్ర ఆందోళనలో ఉంది.
విరాట్, రోహిత్‌లకు విన్నపం
"నేను సెల్ఫీల కోసం అక్కడికి రాలేదు. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని వచ్చాను. రోహిత్ సర్, విరాట్ సర్ పిల్లలకు సహాయం చేస్తారని తెలిసి వారిని కలవడానికి ప్రయత్నించాను. ఆ ఆవేదనలో రోహిత్ గారి చేయి పట్టుకున్నాను. నా చర్యకు అధికారులకు, రోహిత్ గారికి క్షమాపణలు చెబుతున్నాను" అని ఆ మహిళ కన్నీళ్లతో వేడుకుంది. క్రికెటర్ల భద్రత విషయంలో ఇది ఓ లోపంగా కనిపిస్తున్నప్పటికీ..ఓ తల్లి తన బిడ్డ కోసం పడుతున్న ఆవేదన నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. రోహిత్ లేదా విరాట్ కోహ్లీ ఈ విషయంపై స్పందించి సహాయం చేస్తారేమో చూడాలి.