ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు బోణీ కూడా కొట్టని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. కెప్టెన్ వార్నర్ జిడ్డు బ్యాటింగ్, పెద్దగా రాణించని పేసర్లు, మిడిలార్డర్ వైఫల్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ క్యాపిటల్స్ సమస్యలు చాంతాండంత ఉంటాయి. ఇన్ని సమస్యలతోనే ఆడుతున్న ఢిల్లీ ఇప్పుడు తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు రెడీ అయింది.
ఈ సీజన్‌లో కొన్ని అప్‌సెట్లకు కేంద్ర బిందువుగా ఉన్న కేకేఆర్.. ఈ మ్యాచ్ కూడా గెలిచేందుకు రెడీగా ఉంది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లను ఓడించిన కేకేఆర్‌కు సమస్యలు లేవని కాదు. ఈ జట్టు ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో రెండింటిలోనే నెగ్గింది. నెట్ రన్ రేట్ ఫర్వాలేదు. అయితే కేకేఆర్ మరీ ఎక్కువగా తమ స్పిన్నర్లపై ఆధార పడుతోంది.

ఆ జట్టు పేసర్లలో శార్దూల్ ఠాకూర్, ఆండ్రీ రస్సెల్ ఇద్దరూ ఆల్‌రౌండర్లు కావడంతో వారిని పక్కన పెట్టడం కుదరదు. కానీ లోకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్ కూడా పెద్దగా రాణించడం లేదు. వికెట్లు తీయడానికి తెగ కష్ట పడుతున్నారు. ఈ క్రమంలో వీళ్లను తొలగించే అవకాశం ఉంది. అలాగే కేకేఆర్‌కు శుభారంభాలు ఇవ్వడంలో ఆఫ్ఘన్ వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ కూడా విఫలం అవుతున్నాడు.
దీంతో గుర్బాజ్‌ను పక్కన పెట్టి, అవకాశం కోసం ఎదురు చూస్తున్న జేసన్ రాయ్‌ను ఆడించాలని కేకేఆర్ అనుకుంటోంది. ఇక ఢిల్లీ విషయానికొస్తే వరుసగా రెండు మ్యాచుల్లో ఫెయిలైన కుర్రాడు యష్ ధుల్‌ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. బౌలింగ్‌లో విఫలం అవుతున్న ముస్తాఫిజుర్ స్థానంలో లుంగి ఎన్గిడీని ఆడించొచ్చు. మిడిలార్డర్‌లో రావ్‌మెన్ పావెల్‌ను తీసుకోవచ్చు.
కానీ పావెల్ స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేడు. కేకేఆర్ బలం మొత్తం స్పిన్నర్లే. కాబట్టి పావెల్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కకపోవచ్చు. అలాగే పెద్దగా ఆకట్టుకోని ముఖేష్ కుమార్ స్థానంలో చేతన్ సకారియాను ఆడించే అవకాశం కూడా లేకపోలేదు. మిడిలార్డర్‌లో రైలీ రూసోకు మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మిచెల్ మార్ష్ కూడా తన బ్యాటుకు పని కల్పించాల్సిన అవసరం ఉంది.
కేకేఆర్ జట్టు (అంచనా): జేసన్ రాయ్, ఎన్ జగదీశన్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లోకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (అంచనా): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యష్ ధుల్, మనీష్ పాండే, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఆన్రిచ్ నోకియా, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్