ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరుకు అంతా సిద్ధమైంది. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడి, మూడింట ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాగైనా ఒక విజయం నమోదు చేయాలని అనుకుంటోంది. అదే సమయంలో ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన ముంబై కూడా ఎలాగైనా విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో ముంబై ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడే అవకాశం కనిపిస్తోంది.
చెన్నైతో ముంబై ఆడినప్పుడు ఆర్చర్ ఆడలేదు. అతని భుజం నొప్పిగా ఉండటంతో అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఈ గాయం తీవ్రమైంది కాకపోయినా.. ఎందుకైనా మంచిదనే ఉద్దేశ్యంతోనే అతనికి విశ్రాంతి ఇచ్చామని రోహిత్ చెప్పాడు. ఇప్పుడు అతను కోలుకొని ఢిల్లీతో ఆడేందుకు రెడీగా ఉన్నాడని సమాచారం. అలాగే ముంబై చివరగా ఆడిన మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చినా కూడా.. చెన్నైపై కొన్ని విలువైన పరుగులు చేసిన హృతిక్ షోకీన్‌కు మరో అవకాశం ఇవ్వాలని ముంబై భావిస్తోంది.

ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. ఆ జట్టులో కీలక ప్లేయర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో మిడిలార్డర్‌ను బలోపేతం చేయడానికి రైలీ రూసో, మనీష్ పాండేను జట్టులోకి తీసుకుంది. కానీ వాళ్లిద్దరూ చివరి మ్యాచ్‌లో విఫలమయ్యారు. కానీ వాళ్లను ఈ మ్యాచ్‌లో కూడా ఢిల్లీ కొనసాగించాలనే చూస్తోంది. వీళ్లతోపాటు వరుసగా విఫలం అవుతున్న పృథ్వీ షాను కూడా ఆడించాలని ఢిల్లీ నిర్ణయించుకుందని సమాచారం. అలాగే బౌలర్లలో ఖలీల్ అహ్మద్‌కు చిన్న గాయమైందని తెలుస్తోంది.
ఖలీల్ కనుక ఆడకపోతే అతని స్థానంలో చేతన్ సకారియాను ఆడించే అవకాశం కనిపిస్తోంది. మిగతా జట్టులో పెద్దగా మార్పులు కనిపించే అవకాశం లేదు. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ 16వ సీజన్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. దీంతో ఈ రెండు టీమ్స్‌లో తొలి విజయం ఎవరు సాధిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఢిల్లీలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం పైచేయి సాధఇంచే అవకాశం ఉంది.
ముంబై జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెండాఫ్
ఢిల్లీ టీం (అంచనా: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, రైలీ రూసో, మనీష్ పాండే, అభిషేక్ పోరెల్, రోవ్‌మెన్ పావెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఆన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్