ప్లేఆఫ్స్ రేసులో ముంబైకి కీలకమైన మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ముంబై ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచి, తర్వాత జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడితేనే రోహిత్ సేన ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించాలంటే తమ బెస్ట్ ఆటగాళ్లను ఆడించాల్సి ఉంటుంది. అనారోగ్యం కారణంగా రెండు మ్యాచులు మిస్సయిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. ఆ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. అతను కనుక కోలుకుంటే ఈ మ్యాచ్‌లో నేరుగా ప్లేయిగ్ 11లోకి వస్తాడు. అతని కోసం విష్ణు వినోద్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది.

చివరి మ్యాచ్‌లో ముంబై సారధి రోహిత్ శర్మ కూడా ఫామ్ అందుకున్నట్లే కనిపించాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. అదే సమయంలో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనితోపాటు వాంఖడేలో సూర్యకుమార్ యాదవ్ కూడా అదరగొట్టడం గ్యారంటీ అని తెలిసిందే.
కామెరూన్ గ్రీన్ ఇటీవల పెద్దగా ఆకట్టుకోలేదు. అతన్ని టాపార్డర్ నుంచి తీసేసి లోయర్ ఆర్డర్‌లో పంపడం అతని ఆటతీరుపై ప్రభావం చూపింది. ఇక లోయర్ ఆర్డర్‌లో టిమ్ డేవిడ్ చాలా కీలకంగా మారాడు. కుర్రాడు నేహాల్ వధీర కూడా ఒకటి, రెండు మ్యాచుల్లో ఆకట్టుకున్నాడు. ఇక ఈ జట్టుకు అతి పెద్ద బలహీనత బౌలింగే.
ఇటీవల కాలంలో జేసన్ బెహ్రెండాఫ్ కొంత ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్ విభాగాన్ని పీయూష్ చావ్లా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరే ఆ జట్టు బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉన్నారు. ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన క్రిస్ జోర్డాన్.. పొట్టి ఫార్మాట్‌లో తను అంత గొప్ప పేసర్‌ను కానని మరోసారి నిరూపించుకున్నాడు.
డెత్ బౌలింగ్‌లో కూడా జోర్డాన్ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కుమార్ కార్తికేయను రోహిత్ ఆడించే అవకాశం ఉంది. కుడి చేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉన్న సన్‌రైజర్స్‌పై అతను మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏదేమైనా ముంబై విజయావకాశాలు వారి బ్యాటింగ్ బలంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
ముంబై జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, క్రిస్ జోర్డాన్, జేసన్ బెహ్రెండాఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ