గతేడాది తనను అవమానించిన సన్‌రైజర్స్‌పై ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించాడు. ధనాధన్ షాట్లతో పాటు అద్భుతమైన టీం వర్క్‌తో సన్‌రైజర్స్‌ను దెబ్బతీశాడు. ఇప్పుడు మళ్లీ ఆ రెండు జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వరుసగా రెండు విజయాలు సాధించి జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఈ మ్యాచ్‌లో కూడా అదరగొట్టాలని అనుకుంటోంది. అదే సమయంలో వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయాలు మూటగట్టుకున్న సన్‌రైజర్స్ ఎలాగైనా మళ్లీ విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరిస్తుందని తెలుస్తోంది. ఇది సన్‌రైజర్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.

ఎందుకంటే ఆ జట్టు ప్రధాన స్పిన్నర్, చివరి మ్యాచ్‌లో ఢిల్లీపై రాణించిన వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. గాయం కారణంగా అతను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో ఢిల్లీ వద్ద అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. వాళ్లను ఈ స్పిన్ పిచ్‌పై ఎదుర్కోవడం సన్‌రైజర్స్ బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారనుంది.
దీనికితోడు సన్‌రైజర్స్ బ్యాటర్లు కూడా పెద్దగా ఫామ్‌లో లేరు. హ్యారీ బ్రూక్ ఒక్క కేకేఆర్ మ్యాచ్‌లో మాత్రమే రాణించాడు. మయాంక్ అగర్వాల్ రెండు కామియో ఇన్నింగ్సులు ఆడినా.. ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. రాహుల్ త్రిపాఠీ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఎయిడెన్ మార్క్రమ్, అభిషేక్ శర్మ కూడా అడపా దడపా మాత్రమే ఆడుతున్నారు.
ఒక్క హెన్రిక్ క్లాసెన్ మాత్రమే తనకు అప్పజెప్పిన ఫినిషర్ రోల్‌ను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించడం లేదు. అదే సమయంలో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే మిచెల్ మార్ష్ కూడా ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తోంది. మనీష్ పాండే, అక్షర్ పటేల్ చక్కగా ఆడుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఈసారి కూడా సన్‌రైజర్స్‌కు మరో ఓటమి తప్పేలా లేదు.