
హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడిగా కంటే క్రికెటర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. సోమవారం స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ 2019 సంవత్సరానికి గాను ఉత్తమ టెస్టు జట్టుగా భారత్ ఎంపికవ్వడంతో టీమిండియా తరఫున ట్రోఫీని అందుకున్నాడు.
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ టీమిండియాకు ఉత్తమ టెస్టు జట్టు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాల తెలిపాడు. ఈ ఏడాది మిగిలిన జట్లు కూడా గొప్పగానే ఆడాయని చెప్పిన గంగూలీ... టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపాడు.
అస్ట్రేలియాతో మ్యాచ్ ఉండటంతో వారు ఇక్కడ లేరని చెప్పిన దాదా... ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ ఏడాది అండర్ 19 ప్రపంచకప్, పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత జట్లు రాణించాలని ఆశిస్తున్నట్లు దాదా తెలిపాడు.
క్రికెటర్, అధ్యక్ష పదవీ బాధ్యతల నిర్వహణపై గంగూలీ మాట్లాడుతూ "ఒత్తిడిలో ఆడటం ఎంతో కష్టం. ఎందుకంటే ఆ సమయంలో బ్యాటింగ్ చేయడానికి ఒక్క అవకాశమే ఉంటుంది. కానీ, అధ్యక్షుడిగా ఏదైనా పొరపాటు చేస్తే తర్వాత దానిని సరిచేసుకునే అవకాశం ఉంది. మెక్ గ్రాత్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ మీద వేసిన బంతులను ఎదుర్కొన్నట్లుగా" అని సరదాగా వ్యాఖ్యానించాడు.