ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను, ఆసక్తిని రేపిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ "ప్లేయింగ్ ఇట్ మై వే" బుధవారం సాయంత్రం విడుదలైంది. ఈ పుస్తకంలో భారత క్రికెట్ మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై రాసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర సంచలనం రేపాయి. ఆ పుస్తకంలో ఇంకా ఏ విషయాలున్నాయనేది ఆసక్తికరంగానే ఉంది. అయితే, తన సతీమణి అంజలికి సచిన్ టెండూల్కర్ ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఓ అధ్యాయాన్నే కేటాయించారని చెబుతున్నారు.
తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లోని విషయాలను సచిన్ టెండూల్కర్ తన పుస్తకంలో పొందుపరిచారు. భారత క్రికెట్ ప్రముఖులంతా సచిన్ టెండూల్కర్‌ను ఈ పుస్తకం విడుదల సందర్భంగా ప్రశంసలతో ముంచెత్తారు. తమ అనుభవాలను పంచుకున్నారు. తన 34 సెంచరీల రికార్డును సచిన్ సమం చేసినప్పుడు తాను పొందిన అనుభవాన్ని సునీల్ గవాస్కర్ గుర్తు చేసుకున్నారు.

తన రికార్డును సమం చేయగానే తాను నించుని కరతాళ ధ్వనులు చేశానని చెప్పారు. ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ గవాస్కర్ ప్రతిస్పందనను చూసి కంటతడి పెట్టుకున్నారు. పాకిస్తాన్ పర్యటన సందర్భంలో సచిన్ టెండూల్కర్‌ను ఎలా పరిగణించిందీ రవిశాస్త్రి గుర్తు చేసుకున్నారు. వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ ఆడినప్పుడు తొలిసారి చూసిన అనుభవాన్ని గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు.
మజుందార్ ప్రచురణకర్తలకు, ప్రత్యేకంగా అంజలికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు రెండు సమస్యలు ఎదురయ్యాయని, సచిన్ జీవితం తెరిచిన పుస్తకమని, అటువంటప్పుడు తెలియని విషయాలు ఏం చెబుతామనేది తొలి సవాల్ అయిందని, సచిన్ ఏ శైలిలో ముందు పెట్టాలని అనుకుంటున్నాడనేది రెండో సవాల్ అని ఆయన అన్నారు. ఈ పుస్తకం రాయడానికి మూడేళ్లు పట్టిందని, 5 వేల పేజీలకు పైగా ఉందని ఆయన చెప్పారు.

ప్రముఖ క్రీడా జర్నలిస్టు బోరియా మజుందార్ ఈ పుస్తకాన్ని రాయడంలో సచిన్ టెండూల్కర్‌కు సహకరించారు. అంజలికి ప్రత్యేక అధ్యాయం కేటాయించినట్లు, సచిన్‌కూ టెండూల్కర్‌కూ మధ్య సంబంధం గురించి రాయడం కష్టమైందని, ఆ విషయం ఎవరికీ తెలియదని ఆయన అన్నారు.
బాల్ టాంపరింగ్ గురించి కూడా తన పుస్తకంలో సచిన్ టెండూల్కర్ చెప్పారు. తాను బంతిని శుభ్రం మాత్రమే చేశానని చెప్పానని, ఆ సంఘటన తర్వాత తాను బంతిని శుభ్రం చేయడానికి అంపైర్ అనుమతి తీసుకుంటూ వచ్చానని సచిన్ చెప్పారు. పుస్తక విడుదల సమయంలో టెండూల్కర్ సతీమణి అంజలి, కూతురు సారా అతిథులతో ముచ్చటించారు.

గంగూలీపై చమత్కారం
సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి గురించి తాను అమోల్ నుంచి విన్నట్లు వివియస్ లక్ష్మణ్ చెప్పారు. అమోల్ యువకుల గురించి అందరికన్నా ముందు చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎంఆర్ఎఫ్ అకాడమీలో సచిన్ టెండూల్కర్ తన భాగస్వామి అని సౌరవ్ గంగూలీ అన్నారు. దానికి సచిన్ టెండూల్కర్ ప్రతిస్పందిస్తూ "నేనే నీ పార్ట్నర్‌ని. ఎందుకంటే నువ్వు ఒంటరిగా పడుకోవడానికి ఇష్టపడేవాడివి కాదు" అని అన్నారు.
సచిన్ టెండూల్కర్‌ను నెట్స్‌లో తొలిసారి గంగూలీ ఇండోర్‌లో చూశారు. టెండూల్కర్‌ను తప్పించడానికి అందరూ నిరీక్షిస్తున్నారని, అందరూ తమ అవకాశం కోసం చూస్తున్నారని అన్నారు. టెండూల్కర్ భారీ బ్యాట్‌తో ఆడడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు.

ఫ్యామిలీతో టెండూల్కర్
పుస్తకం విడుదల కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో కూర్చోగా, గవాస్కర్ తొలి వరుసలో కూర్చున్నారు. అతిథుల్లో టెండూల్కర్‌తో పాటు జట్టులో కొనసాగిన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వివియస్ లక్ష్మణ్ ఉన్నారు.
వెంగ్‌సర్కార్ ఇలా..
వాసు పరంజపే ముంబై కోసం ఆడడానికి సచిన్ టెండూల్కర్‌ను తీసుకుని వచ్చాడని, తాను ప్రాక్టీస్ చేస్తున్నానని, ఈ కిడ్‌ను ఓసారి చూడు అని పరంజపే చెప్పాడని, నెట్‌లో కపిల్ దేవ్‌ను ఎదుర్కున్నాడని, దాంతో ముంబై జట్టులో టెండూల్కర్ ఉండాలని సెలెక్టర్లకు చెప్పానని వెంగ్ సర్కార్ చెప్పారు. మొదటి మూడు రోజులు ప్రాక్టీస్‌కు రాలేదని, ఎందుకు రాలేదని అడిగితే తనకు డ్రాయింగ్ ఎగ్జామ్ ఉందని సచిన్ చెప్పాడని ఆయన చెప్పారు.
గొప్ప జ్ఞాపకాలు
సచిన్‌కు సంబంధించి తనకు గొప్ప జ్ఞాపకాలున్నాయని రాహుల్ ద్రావిడ్ అన్నారు. రిటైర్ అయిన తర్వాత కూర్చుని నెమరేసుకుంటే గొప్ప భావన కలుగుతుందని అన్నారు. తామిద్దరం పోటీ పడ్డామని, ఒకరినొకరం ముందుకు నడిపించుకున్నామని చెప్పారు. తామిద్దరం మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నప్పుడు మరాఠీలో మాట్లాడుకునేవారమని ద్రావిడ్ చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో సచిన్ ఒక్కడని ఆయన అన్నాడు.
లక్ష్మణ్ షాట్ కొట్టేవాడు..
అత్యంత నియంత్రణ గల సచిన్ టెండూల్కర్ వంటి బ్యాట్స్‌మన్‌ను తాను చూడలేదని, పాకిస్తాన్‌పై 136 పరుగులు చేసిన తీరును మరిచిపోలేమని లక్ష్మణ్ అన్నాడు. లక్ష్మణ్ లాగా షేన్ వార్న్‌ను బాదిన బ్యాట్స్‌మన్ లేడని సచిన్ టెండూల్కర్ అన్నారు.