మరో ఆరు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే ఈ మహా సమరానికి సన్నాహకంగా ఇంగ్లండ్-పాకిస్థాన్ నాలుగు టీ20ల సిరీస్ ఆడుతోంది. ప్రపంచకప్ ముందు ఇది మంచి ప్రాక్టీస్ అవుతుందని, జట్టు కూర్పును సిద్ధం చేసుకోవచ్చని ఇరు జట్లు భావిస్తున్నాయి.
నాలుగు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. వరుణుడు తన ప్రతాపం చూపించడంతో కనీసం టాస్ కూడా పడలేదు. శనివారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 183 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తూ కెప్టెన్ బట్లర్ (84; 51 బంతుల్లో, 8x4, 3x6) సత్తాచాటాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్ చెరో రెండు వికెట్లు తీశారు..

అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. ఫకర్ జమాన్ (45; 21 బంతుల్లో, 5x4, 3x6) టాప్ స్కోరర్. టోప్లే మూడు వికెట్లు, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే పాకిస్థాన్ ప్రదర్శన అనంతరం ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు నాజర్ హుస్సేన్, మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ జట్టు పరువు పోయేలా విమర్శలు చేశారు. టీ20 వరల్డ్ కప్‌కు పాకిస్థాన్‌తో సిరీస్ కంటే ఐపీఎల్‌యే తమ ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్‌గా ఉంటుందని మైకేల్ వాన్ అన్నాడు.
''పాకిస్థాన్ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు స్వదేశానికి వచ్చి పొరపాటు చేశారు. పాక్ సిరీస్‌కు బదులుగా బట్లర్, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడాల్సింది. ఎంతో ఒత్తిడి, అంచనాలు, ప్రజల మధ్య జరిగే ఐపీఎలే పాకిస్థాన్ సిరీస్ కంటే ఇంగ్లండ్ ప్లేయర్లకు మంచి సాధన. అంతర్జాతీయ క్రికెట్‌ను నేను ప్రేమిస్తాను. కానీ బట్లర్ కాకపోయినా, విల్ జాక్స్, సాల్ట్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడాల్సింది'' అని మైకేల్ వాన్ అన్నాడు.

మరోవైపు నాజర్ హుస్సేన్ పాకిస్థాన్ బోర్డు నిర్ణయాలన విమర్శించాడు. పాకిస్థాన్ జట్టులో ఎవరూ ఎక్కువ కాలం రిటైర్మెంట్ తీసుకోలేరని, అలాగే ఎక్కువకాలం కెప్టెన్సీ చేయలేరని అన్నాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం బాబర్ అజామ్ కెప్టెన్సీపై పాక్ బోర్డు వేటు వేసిన విషయం తెలిసిందే. కానీ టీ20 వరల్డ్ కప్ ముందు బాబర్‌కు తిరిగి జట్టు పగ్గాలను అందించింది. మరోవైపు ఇమాద్ వసీమ్ ఇటీవల తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. అనంతరం టీ20 వరల్డ్ కప్‌కు కూడా సెలక్ట్ అయ్యాడు. దీనిపై నాజర్ హుస్సేన్ ట్రోల్ చేశాడు.