ఐపీఎల్‌లో గాయాల బారిన పడొద్దు: కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు భజ్జీ సూచన


హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఎలాంటి గాయాలకు గురవకుండా జాగ్రత్త పడాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఈ ఏడాది మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్ గెలిచి నంబర్ వన్ జట్టుగా వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టాలని భజ్జీ పేర్కొన్నాడు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హర్భజన్ సింగ్ మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌కు చాలా సమయం ఉంది. అప్పటివరకూ ఏదైనా జరగొచ్చు. మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుత టీమిండియా జట్టు ఎలాంటి ఛాంపియన్ కప్పునైనా గెలుచుకోగలదు. కాగా ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో ఆటగాళ్లు గాయాలబారిన పడే ప్రమాదముంది
"దీంతో ఆటగాళ్లు గాయాలబారిన పడే ప్రమాదముంది. అయితే వరుస మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆటగాళ్లకు సరైన ఫిట్‌నెస్ లభిస్తుంది. కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్రధాన ఆటగాళ్లు ఈ సమయంలో గాయాలబారిన పడి వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి దూరం కావొద్దు. వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేయాలి" అని భజ్జీ అన్నాడు.

కోహ్లీపై ప్రశంసల వర్షం
వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడుతోన్న చివరి వన్డే సిరిస్‌పై కూడా హర్భజన్ స్పందించాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి నంబర్ వన్ స్థానంలో టీమిండియా వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టాలని భజ్జీ కోరాడు. ఇక, రాంచీ వన్డేలో 41వ సెంచరీ బాదిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భజ్జీ ప్రశంసల వర్షం కురిపించాడు.

అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ ఒకడు
"ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ ఒకడు. గత నాలుగైదేళ్లుగా కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే అతడెలా మారిపోయాడో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కోహ్లీకి మాత్రం ఏ బలహీనత లేదు. ప్రత్యర్థి బౌలర్ ఏ బంతి వేసినా దాన్ని వేటాడే సత్తా కోహ్లీ సొంతం. ఒక వేళ నేను కోహ్లీకి బౌలింగ్ చేయాల్సి వస్తే కాస్త ఆలోచించాలి" అని హర్భజన్ అన్నాడు.

నాలుగో వన్డేలో భారత్ ఓటమి
కాగా, నాలుగో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications