
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్ 19) పంజా విసురుతుండడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13 ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా ముప్పుతో అన్ని ఫ్రాంచైజీలు తమ శిబిరాలను రద్దు వేస్తున్నామని ప్రకటించాయి. ఇప్పటికే సాధనా శిబిరాలన్నీ ఖాళీ అయ్యాయి. తిరిగి పిలుపునిచ్చేంత వరకు ఆటగాళ్లెవరూ రానవసరం లేదని ఫ్రాంచైజీలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం.. ఐపీఎల్-13 మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉండేది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సాధనా శిబిరాన్ని రద్దు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం బెంగళూరు శిబిరం మార్చి 21న ఆరంభం కావాల్సి ఉంది. 'ప్రతి ఒక్కరి ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మార్చి 21న ఆరంభం కావాల్సిన ఆర్‌సీబీ శిక్షణ శిబిరాన్ని వాయిదా వేస్తున్నాం. మరోసారి నోటీసు ఇచ్చేంత వరకు ఆటగాళ్లెవరూ రానవసరం లేదు. అందరూ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించాలని కోరుతున్నాం' అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ శిబిరాలను ఇప్పటికే రద్దు చేశాయి. కరోనా వేగంగా విజృంభిస్తుండడంతో.. చెన్నై ఫ్రాంఛైజీ తమ ప్రాక్టీస్ సెషన్‌కు శనివారం ముగింపు పలికింది. దీంతో ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా అంబటి రాయుడు, సురేశ్ రైనా, మురళి విజయ్ మరికొందరు ఆటగాళ్లు శనివారం చెన్నైను వీడి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
కరోనా పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తే.. ఏప్రిల్ 15 లోగా టోర్నీపై నిర్ణయం తీసుకుంటారు. అయితే కొవిడ్-19 ముప్పు కాస్త ఎక్కువగానే కనిపిస్తుండటంతో అన్ని ఫ్రాంచైజీలు ఈ సీజన్‌పై ఆశలు వదిలేసుకున్నాయని తెలుస్తోంది. జట్లన్నీ ఈ సారి టోర్నీ ఉండకపోవచ్చని మానసికంగా సంసిద్ధమయ్యాయని సమాచారం. సోమవారం జరిగిన ఫ్రాంచైజీలు, బీసీసీఐ కాన్ఫరెన్స్ కాల్‌లో ఈ విషయంపై చర్చించుకున్నారని వినికిడి.