బీసీసీఐ పెట్టిన ఫ్యామిలీ రూల్ పై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ నిబంధనపై వ్యతిరేకంగా మాట్లాడడంతో.. ఈ రూల్ మరింత చర్చనీయాంశంగా మారింది. దీంతో బీసీసీఐ.. ఈ నిబంధన విషయంలో కొన్ని మార్పులు చేసి ప్లేయర్స్ కు అనుకూలంగా వెసులుబాటు కల్పిస్తుందని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌దత్ సైకియా మరోసారి స్పందించారు. ఫ్యామిలీ పాలసీలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టత ఇచ్చారు. ఐపీఎల్ తర్వాత జూన్, జులైలో టీమిండియా.. ఇంగ్లాండ్‌లో 5 టెస్టు మ్యాచులు ఆడనుంది. అప్పుడు కూడా బీసీసీఐ పెట్టిన ఫ్యామిలీ రూల్ ను ప్లేయర్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని ఇప్పుడు నుంచే ఆటగాళ్లను సంసిద్ధం చేశారు దేవ్‌దత్ సైకియా.
"ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ పాలసీ మన దేశంతో పాటు, బీసీసీఐకి ఎంతో ముఖ్యమైనది. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పటి నుంచో ఈ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ను జట్టు సమన్వయం, ఐక్యత కోసం తీసుకున్న నిర్ణయాలే" అని సైకియా పేర్కొన్నారు.

రూల్ ఇదే..
రీసెంట్ గా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణ ప్రదర్శన చేసింది. అందుకే ఆ తర్వాత నుంచి బీసీసీఐ ఆటగాళ్ల విషయంలో పలు ఆంక్షలను విధించింది. గతంలో విదేశీ పర్యటనలో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు 45 రోజుల వరకు ఉండటానికి అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును రెండువారాలకే పరిమితం చేసింది.