గొడవకు కారణం ఇలా..
ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను వివరించాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ మేరకు ఈ మధ్యాహ్నం అతను ఓ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, ఇవాన్ మోర్గాన్ మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో టిమ్ సౌథీ విసిరిన తొలి బంతిని రవిచంద్రన్ అశ్విన్ షాట్ కొట్టేందుకు యత్నించాడు. ఆ షాట్‌ని నితీష్ రాణా క్యాచ్ పట్టుకోవడంతో అశ్విన్ పెవిలియన్‌కు వెనుదిరిగాడు.
మోర్గాన్‌తో గొడవ..
ఆ మ్యాచ్‌లో అతను తొమ్మిది పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే పెవిలియన్ వైపు వెళ్తోన్న అశ్విన్‌ను ఉద్దేశించి- బౌలర్ టిమ్ సౌథీ కామెంట్స్ చేశాడు. దీనితో ఆగ్రహానికి గురైన అశ్విన్ సౌథీ వద్దకు వస్తోండగా.. ఇవాన్ మోర్గాన్ అడ్డుపడ్డాడు. దీనితో అతను మోర్గాన్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంగా మోర్గాన్‌పైకి దూసుకుని వస్తుండగా.. నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ జోక్యం చేసుకున్నాడు. అశ్విన్‌ను సర్ది చెబుతూ వెనక్కి పంపించాడు.
సుదీర్ఘమైన ట్వీట్
ఈ ఘటన మీద అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చాడు. దీనికోసం ఓ సుదీర్ఘమైన ట్వీట్‌ను అతను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. అక్కడ చోటు చేసుకున్న ఉదంతాన్నినాలుగు ప్రశ్నలుగా విభజించాడు. వాటిని తానే సమాధానాలను ఇచ్చుకున్నాడు. డీప్ నుంచి కేకేఆర్ ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి విసిరిన బంతికి ఎక్స్‌ట్రా రన్ తీయబోయాడు అశ్విన్. దీన్ని మోర్గాన్ తప్పు పట్టాడు. డిస్ గ్రేస్ అంటూ కామెంట్ చేశాడు. ఎంసీసీ రూపొందించిన నిబంధనలకు ఇది విరుద్ధమని, స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌కు విరుద్ధమని పేర్కొన్నాడు.
ఆత్మగౌరవం కోసం
దీనికి అశ్విన్ వివరణ ఇచ్చాడు. త్రిపాఠి విసిరిన బంతి రిషభ్ పంత్‌కు తగిలిందా? లేదా? అనేది తనకు తెలియదని, రన్ తీయడానికి మాత్రమే తాను ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. ఆ బంతిని తాను చూసి ఉంటే రన్ కోసం ప్రయత్నించి ఉండే వాడిననీ అన్నాడు. మోర్గాన్ చేసిన కామెంట్స్‌తో తాను ఏకీభవించట్లేదని పేర్కొన్నాడు. తాను వారితో ఘర్షణ పడలేదని, తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పిన విధంగా.. తనకు తానుగా ఆత్మగౌరవం కోసం వారికి ఎదురుగా నిల్చున్నానని చెప్పాడు.
డిబేట్లు పెట్టడం ఆశ్చర్యం..
ఆత్మగౌరవం కోసం ఎవరితోనైనా పోటీ పడేలా పిల్లలకు నేర్పించాలని రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. మోర్గాన్ గానీ, టిమ్ సౌథీ గానీ క్రికెట్‌లో ఎన్ని పేరు ప్రఖ్యాతులు సాధించినా.. పరుషంగా మాట్లాడటం, ఎదుటివారి నైతికతను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని చెప్పాడు. ఈ గొడవ గురించి జనం చర్చించుకోవడం, డిబేట్లు పెట్టడం తనను మరింత ఆశ్చర్యానికి గురి చేసిందని, ఈ ఎపిసోడ్‌లో ఎవరు మంచివాడు.. ఎవరు చెడ్డవాడు అని తీర్మానించడానికి ప్రయత్నించడం ఆశ్చర్యపరుస్తోందని అన్నాడు.
చిత్తశుద్ధి అవసరం..
ఆన్ ఫీల్డ్ క్రికెటింగ్ డెసిషన్లపై ఏది మంచి.. ఏది చెడు అనే విషయాన్ని నిర్ధారించకూడదని రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. లేని పరుగు కోసం ప్రయత్నించడం ద్వారా లేదా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరించడం ద్వారా ఓ ప్లేయర్ మంచివాడు అవుతాడనే కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేయొద్దని కోరాడు. క్రికెట్ మ్యాచ్ ఆడే విషయంలో చిత్తశుద్ధిని కనపర్చాలని, నిబంధనలకు అనుగుణంగా, వాటికి లోబడి ఆడాలని సూచించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ చేతులు కలుపుకొని వెళ్లాల్సిందేనని అన్నాడు. స్పిరిట్ ఆఫ్ ది గేమ్ అనడానికి ఇదొక్కటే నిదర్శనంగా తాను భావిస్తున్నానని రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












