ఆసియా కప్ 2025 కోసం భారత టీ20 జట్టులో స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌లను చేర్చకపోవడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయంపై భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సెలక్షన్ కమిటీపై తీవ్రంగా మండిపడ్డారు. జట్టు కోసం ఆడే ఆటగాళ్లుకు ఇదేనా గతి? ఇకపై వారు స్వార్థంగా ఆడాలని భావిస్తారని అశ్విన్ విమర్శలు గుప్పించారు.
'జట్టు కోసం ఆడిన వారిని పక్కన పెడతారా?' - అశ్విన్ ఆగ్రహం
అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌లను జట్టు నుంచి తొలగించడంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. "జట్టును ఎంపిక చేయడం చాలా కష్టమైన పని, కొంతమందిని తప్పించాల్సి ఉంటుంది. కానీ యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ విషయంలో జరిగింది చాలా బాధాకరం. ఇది అన్యాయం" అని అశ్విన్ అన్నారు. "యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు చాలా అరుదుగా దొరుకుతారు. వారు తమ వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా, జట్టు కోసం, జట్టు స్ట్రైక్ రేట్ కోసం ఆడతారు. అలాంటి ఆటగాళ్లను మీరు జట్టు నుండి తొలగిస్తే, అది వారికి తప్పుడు సంకేతాలు పంపుతుంది" అని అశ్విన్ పేర్కొన్నారు.

నేనైతే నాకోసం ఆడతాను.. అశ్విన్ ఓపెన్ కామెంట్
ఈ వివాదంపై అశ్విన్ చేసిన ఓ వ్యాఖ్య పెద్ద చర్చకు దారితీసింది. "ఒకవేళ నేను యశస్వి జైస్వాల్ లేదా శ్రేయస్ అయ్యర్‌లా ఉండి ఉంటే, నేను మళ్లీ ఇలాంటి రిస్క్ తీసుకోను. నా సగటును పెంచుకోవడానికి, జట్టులో నా స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నా కోసం ఆడటం మొదలుపెడతాను" అని అశ్విన్ ఘాటుగా చెప్పారు. జట్టు ప్రయోజనాల కోసం దూకుడుగా ఆడి ఔటయ్యే ఆటగాళ్లను పక్కన పెట్టడం, వారిని స్వార్థంగా ఆడేలా ప్రోత్సహిస్తుందని రవిచంద్రన్ అశ్విన్ ప్రధానంగా ఆరోపించారు. కాగా.. శుభ్‌మన్ గిల్ స్వార్థంగా ఆడతాడని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ అతడికి భారత జట్టు వైస్-కెప్టెన్సీ లభించింది.
అద్భుత ప్రదర్శన ఉన్నా అవకాశంలేదు..
గత 2025 ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ 604 పరుగులు చేసి, పంజాబ్ కింగ్స్ జట్టును 11 సంవత్సరాల తర్వాత ఫైనల్‌కు చేర్చారు. అలాగే, యశస్వి జైస్వాల్ 14 మ్యాచ్‌లలో 559 పరుగులు చేశారు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో కూడా జైస్వాల్ 164 అనే అద్భుతమైన స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నారు. ఇంత అద్భుతంగా రాణించిన తర్వాత కూడా యశస్వి జైస్వాల్‌కు రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో మాత్రమే చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. శ్రేయస్‌కు కనీసం రిజర్వ్ ప్లేయర్‌గా కూడా అవకాశం లభించలేదు.
సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఈ విషయంపై స్పందిస్తూ, "అభిషేక్ శర్మ బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి జైస్వాల్‌కు బదులుగా అతడిని ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్‌ను ఏ ఆటగాడికి బదులుగా చేర్చాలి? ఇది అతని తప్పు కాదు, మా తప్పు కూడా కాదు" అని చెప్పారు.