ఫేమ్ వచ్చిన తర్వాత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మారిపోయాడని సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గత నెలలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను మరో సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఖండించాడు. కోహ్లి ఏం మారలేదని, గతంలో ఉన్నట్లుగానే అందరితో మంచిగా ఉన్నాడని చావ్లా తెలిపాడు.
అసలేం జరిగిందంటే..ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్ మిశ్రా కోహ్లిపై ఘూటు విమర్శలు చేశాడు. రోహిత్ శర్మతో పోలుస్తూ కోహ్లి వ్యవహార శైలి బాగోలేదని, డబ్బు, పేమ్‌తో మారిపోయాడని మిశ్రా అన్నాడు. కెప్టెన్సీకి ముందు కోహ్లి ఒకలా, తర్వాత మరోలా ఉన్నాడని తెలిపాడు. కానీ రోహిత్ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉన్నాడని, హిట్‌మ్యాన్ స్వభావం ఏం మారలేదని పేర్కొన్నాడు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అమిత్ మిశ్రా వ్యాఖ్యలను కొందరు నేరుగా, మరికొందరు పరోక్షంగా ఖండించారు. తాజాగా ఆ జాబితాలో పీయూష్ చావ్లా చేరాడు. అమిత్ మిశ్రాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నట్లుగా కోహ్లి గురించి వివరించాడు. ''గత 10-15 ఏళ్లు మందు విరాట్ కోహ్లి ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అలానే ఉన్నాడు. అతనితో నా అనుభవం ఎప్పుడూ మంచిగానే ఉంది. మేం మంచి స్నేహితులం''
''ఆసియా కప్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో కామెంటరీ స్టింట్ కోసం నేను అక్కడే ఉన్నాను. కోహ్లి నా దగ్గరకు వచ్చి.. 'చావ్లా.. తినడానికి ఏమైనా ఆర్డర్ ఇద్దాం' అన్నాడు. గత 15 ఏళ్ల క్రితం కూడా కోహ్లి అలానే నాతో మాట్లాడేవాడు'' అని చావ్లా గుర్తుచేసుకున్నాడు.
కాగా, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం విరామం తీసుకున్న విరాట్ కోహ్లి.. టీమిండియా నయా కోచ్ గౌతమ్ గంభీర్ అభ్యర్థన మేరకు శ్రీలంక వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే లంకతో జరిగిన సిరీస్‌లో కోహ్లి విఫలమయ్యాడు. 24, 14, 20 పరుగుల మాత్రమే చేశాడు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు కోహ్లి తిరిగి తన బ్యాటుకు పనిచెప్పనున్నాడు.