
ముంబై: టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన అతని తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా కరోనా పోరాడిన పీయూష్ తండ్రి చివరకు మహమ్మారికి బలైయ్యారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. విషయం తెలుసుకున్న సహచర ఆటగాళ్లు, అభిమానులు పీయూష్ చావ్లాకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ కష్ట సమయంలో మనో ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు.
నాన్న లేకుండా మిగతా జీవితం గతంలోలా ఉండదని, ఈ రోజు తన మూల స్తంభంను కోల్పోయా అని పీయూష్ చావ్లా ట్వీట్ చేశాడు. 'ఈ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది. నా ప్రియమైన నాన్న మిస్టర్ ప్రమోద్ కుమార్ చావ్లా ఈ రోజు (2021 మే 10) చనిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మీరు ఇచ్చిన మద్దతు మరువలేనిది. నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అని చావ్లా తన తండ్రి చిత్రంను షేర్ చేసి ఇలా పేర్కొన్నాడు.
32 ఏళ్ల లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయినప్పటికీ అతను 2012 నుండి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. 2014లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో భాగమైన పియూష్ చావ్లాను గత ఫిబ్రవరి వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రాహుల్ చహర్ అద్భుతంగా రాణించడంతో ముంబై తుది జట్టులో చావ్లాకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ 2021 వాయిదాపడే సమయానికి ముంబై 7 మ్యాచులు ఆడింది. భారత్ తరఫున చావ్లా 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా తండ్రి కూడా కరోనాకు బలైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడిన సకారియా తండ్రి కంజి భాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఇంటికి చేరిన సకారియా తన తండ్రిని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. గుజరాత్‌కు చెందిన సకారియా తండ్రి కొన్నేళ్లుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే కరోనా అతని తండ్రిని బలి తీసుకుంది.