మొహాలి: ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా ఆదివారం సాయంత్రం మొహాలీలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఇరుజట్లకు అభినందనలు తెలిపారు. రేడియో ద్వారా మనసులోని మాటను(మన్ కీ బాత్) ప్రజలతో పంచుకున్నారు.
వరల్డ్ టీ20లో టోర్నీలో రెండు విజయాలు సాధించిన టీమిండియాకు ఆయన అభినందనలు తెలిపారు. మరోవైపు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్ టోర్నీలో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది కాబట్టి.
సెమిస్ బరిలో టీమిండియా నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఇందుకోసం మొహాలిలోని పీసీఏ స్టేడియంలోని పిచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. టీమిండియా మేనేజ్‌మెంట్ సూచన ప్రకారం టర్నింగ్ ట్రాక్‌ను సిద్ధం చేశారని సమాచారం.

వాస్తవానికి 'పాకిస్థాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం సిద్ధం చేసిన తరహా పిచ్‌నే మొదట అనుకున్నాం. కానీ టీమిండియా ఈ రకమైన పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్పులు చేయాల్సిందిగా సూచించింది. దీంతో వారు కోరినట్టుగా స్పిన్‌కు, కొద్దిగా బౌన్స్‌కు దోహదపడే పిచ్‌ను రెడీ చేశాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
నిజానికి స్వదేశంలో సిరీస్‌లు జరుగుతున్నప్పుడు ఆతిథ్య జట్టు సూచనల మేరకు పిచ్‌లను మారుస్తుంటారు. కానీ, ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో ఆతిథ్యమిస్తున్న జట్టు ఇష్టానుసారంగా పిచ్ మార్చడం కుదరదు. ఐసీసీ నియమించిన క్యూరెటర్ సూచన మేరకు పిచ్ సిద్ధం చేయాలి.
కానీ ఐసీసీనే భారత్‌ను శాసిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పిచ్ మార్పులు నేపథ్యంలో భారత్‌కు కలిసొస్తుందా లేదా? అన్న ప్రశ్న సగటు అభిమానిలో మొదలైంది. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ పైనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది.

అంతకు ముందు సాధించిన రెండు విజయాలు కూడా ఏమంత గొప్ప విజయాలు కావు. టైటిల్ హాట్ ఫేవరెట్ టీమిండియా ఆశించిన ప్రదర్శన చేయడం లేదు. ముఖ్యంగా బ్యాటింగ్ సమస్యలు జట్టును వెంటాడుతున్నాయి. ఓపెనర్లు ఇంకా కుదురుకున్నట్టు కనిపించడం లేదు. మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, యువరాజ్ ఇంకా తడబడుతూనే ఉన్నారు.
విరాట్ కోహ్లీ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. పాక్‌పై అజేయంగా 61 రన్స్ చేసిన కెప్టెన్ స్టీవ్‌స్మిత్ జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో వాట్సన్ జట్టు భారీ స్కోరులో భాగస్వామి అయ్యాడు. ఈ టోర్నీ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న వాట్సన్‌కు భారతతో మ్యాచే ఆఖరిది కాకూడదని ఆసీస్ భావిస్తోంది.
టీ-20 ఫార్మాట్‌లో ఆసీస్‌కు గొప్ప రికార్డు లేదు. 2007 టోర్నీలో సెమీస్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాతి ఎడిషన్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టారు. 2010లో రన్నర్‌పగా నిలిచిన కంగారూలు గత టోర్నీలో కూడా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టారు. కాగా ఇటీవల భారత్-ఆసీస్ మధ్య జరిగిన సిరీస్‌లో భారత్ 3-0తో విజయం సాధించింది.