ముంబై: వరుస విజయాలతో బలమైన జట్టుతో భారీ అంచనాల మధ్య ఐసీసీ వరల్డ్ టీ20లో హాట్ ఫేవరేట్ బరిలోకి దిగిన టీమిండియాను అద్భుతమైన పోరాటపటిమతో న్యూజిలాండ్ జట్టు బోల్తా కొట్టించింది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 47 పరుగులతో ధోనీసేనను చిత్తుచేసింది.
127 పరుగుల తక్కువ లక్ష్యాన్ని చేధించలేక 79 పరుగులకే టీమిండియా చేతులెత్తేయడం భారత అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కోసం స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా రూపొందించిన నాగ్‌పూర్ పిచ్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి టీమిండియా బలం స్పిన్. కానీ అదే నాగ్‌పూర్ మ్యాచ్‌లో బలహీనతగా మారింది. న్యూజిలాండ్ కోసం తవ్విన 'స్పిన్' మాయలోనే భారత్ పడిపోయిందంటున్నారు. హాట్ ఫేవరేట్‌గా టీ20లో అడుగుపెట్టిన ధోనిసేనకు న్యూజిలాండ్ జట్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

అంతేకాదు అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాను కేవలం 79 పరుగులకే కుప్పకూల్చి భారత జట్టుకు పరాభవాన్ని మిగిల్చారు. పిచ్ ఎంతగా స్పిన్నర్లకు అనుకూలించినప్పటికీ, పరిస్థితులకు తగ్గట్లు ఆడకుండా నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు చేజార్చుకున్నారంటూ సెటైరికల్ వ్యాఖ్యలతో ట్విట్టర్‌ను ముంచెత్తారు.
ప్రపంచంలోనే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే జట్టు టీమిండియా. స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఆడకూడదో చూపిందని పలువురు విమర్శించారు. నాగ్‌పూర్ పిచ్ యాంటీ నేషనల్ అయి ఉంటుందని, అందుకే లక్షఛేదనలో 47 పరుగులకు ఆలౌట్ అయిందని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
పిచ్ క్యూరేటర్ జెఎన్‌యూలో చదివి ఉంటాడని, అందుకే పిచ్ సహకరించలేదని మరో నెటిజన్ చమత్కరించాడు. బీసీసీఐ అంటే 'బోరెడ్ ఆఫ్ క్రికెట్ కొలాప్స్ ఇన్ ఇండియా' అని ఒకరు నిర్వచనమిచ్చాడు. ఈ ఓటమికి శిక్షగా ఆటగాళ్లకు 'తేరా సురూర్' సినిమాను బీసీసీఐ చూపించాలంటూ మరో నెటిజన్ సెటైర్ వేశారు.